APAAR ID Card for Students : ఆధార్ తరహాలో విద్యార్థులకు సంబంధించిన అకడమిక్ వివరాలన్నింటినీ పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం 'అపార్'కు రూపకల్పన చేసింది. వన్ నేషన్-వన్ స్టూడెంట్ ఐడీ పేరిట కేంద్ర విద్యాశాఖ 12 అంకెలతో కూడిన కార్డును కేటాయిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల అకడమిక్ వివరాలతో పాటు వారి ధ్రువపత్రాలను డిజిటల్‌గా భద్రపరిచేలా ఈ ‘అపార్’ కార్డుకు రూపకల్పన చేసింది.
అపార్ డిజిటల్ కార్డులో ఉండే వివరాలు : ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (APAAR) దీనినే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ కార్డు అని కూడా పిలుస్తారు.
- పేరు
- పుట్టిన తేదీ
- జెండర్
- ఫొటో
- క్యూఆర్ కోడ్
- 12 అంకెల గుర్తింపు నంబరు
- విద్యార్థి మార్కులు
- గ్రేడు
- ఉపకార వేతన వివరాలు
- క్రీడల్లో సాధించిన విజయాలు
- వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలు
ఈ వివరాలు అన్నీ అపార్ డిజిటల్ కార్డులో భద్రంగా ఉంటాయి. స్కాన్ చేస్తే మొత్తం అన్నీ తెలుసుకునేలా అపార్ను రూపొందించారు. తొలుత 9-12 తరగతుల వారికి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. 9, 10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు జారీ చేసేందుకు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు.
ఆపార్‌తో తీరనున్న విద్యార్థుల కష్టాలు : ఏపీకి(పక్క రాష్ట్రాలకు) చెందిన విద్యార్థులు ఆయా జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో డిగ్రీ లేదా పీజీ కోర్సులో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడి విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనాలు అందిస్తారు. దీంతో మిగతా వారు తమ సొంత రాష్ట్రాల్లో ఉపకార వేతనాలకు దరఖాస్తు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో చదువుతున్నట్లు వివరాలు అందుకు సంబంధించి దస్త్రాలు సమర్పించాలని, రిజిస్ట్రార్ సంతకంతో ధ్రువీకరణ ఉంటేనే ఇస్తామని చెప్పారు.
అన్నీ వివరాలు ఒకే చోట : ఆ విద్యార్థులు ఇక్కడి నుంచి అక్కడకు, అక్కడ నుంచి ఇక్కడకు పలుమార్లు తిరగాల్సి వచ్చింది. దీంతో విలువైన సమయం, సొమ్ము, తరగతులు వృథా అయ్యాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఆపార్‌తో విద్యార్థులకు ఇకపై ఇలాంటి కష్టాలు ఉండవని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు యూడైస్ వెబ్‌సైట్‌లో ప్రతి విద్యార్థికి పెన్ (పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు) ఉంది. దీని ఆధారంగానే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం, టీసీలు జారీచేయడం చేస్తున్నారు. ఇకపై ఆపార్‌తోనే అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తారు.
ఎక్కడైనా ప్రవేశాలు : కేంద్ర ప్రభుత్వం జారీచేసే గుర్తింపు సంఖ్య ఆధారంగా అపార్ కార్డులో విద్యార్థి బ్యాంకు ఖాతా, డిజి లాకర్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ కార్డులను జారీచేసే ముందు కేంద్ర ప్రభుత్వ అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ)ని ప్రారంభించింది. డిజి లాకర్ ద్వారా వివరాలు నమోదు చేస్తే విద్యార్థి పేరుతో అపార్ కార్డు వస్తుంది. దీనిని నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా వివిధ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల్లో వివరాలు నమోదు, ధ్రువీకరణ తదితర పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. ఇకపై ఉపకారల వేతనాల మంజూరు, ఉద్యోగాల భర్తీ, ఇతర సందర్భాల్లో ఇదే కీలకం కానుంది. ఈ విధానంపై ఇప్పటికే అధికారులకు అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థికీ దీనిని ఇవ్వడానికి కసరత్తు ముమ్మరం చేశారు.
మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉంది సరే - మరి "అపార్" కార్డు ఉందా?