Prakasam Barrage Boats Removal Process : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు, నిపుణులను బోట్లు ముప్పతిప్పలు పెడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టతరంగా మారింది. బోట్లను ఒడ్డుకు తీసేందుకు ఆరు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తోన్నప్పటికీ ఫలితం కనపడటం లేదు. అబ్బులు బృందం ఒక పడవను కూడా బయటకు తీసుకుని రాలేకపోయింది. దీంతో మరో ప్రణాళికను బెకెం సంస్థ అమలు చేయాలని నిర్ణయించింది. రెండు భారీ పడవలను గడ్డర్లతో కలిపి ఇంజినీర్లు అనుసంధానిస్తున్నారు.
6వరోజు కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ : ఆ పడవల్లో ఇసుక, నీరు నింపి చిక్కుకున్న పడవలను వెలుపలకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి చిక్కుకుపోయిన పడవల తొలగింపు ప్రక్రియ 6వ రోజూ కొనసాగుతోంది. పడవలను ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ఇంజినీర్లు, అధికారులు, బోట్లు వెలికి తీసే నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇసుకలో ఇరుక్కోవడంతో బోట్ల వెలికితీత ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది.
ఈనెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి వేగంగా కొట్టుకు వచ్చిన ఐదు బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొన్నాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, 3 భారీ పడవలు, ఒక మోస్తరు పడవ కలిపి గేట్లవద్దే చిక్కుకున్నాయి. పడవలకు ఒకదానితో మరొకటి కట్టి వదలడంతో లంకె పడ్డాయి. దీంతో బ్యారేజీ గేట్లకు అడ్డుపడి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. అడ్డుపడిన భారీ పడవలను తొలగించడానికి కాకినాడకు చెందిన అబ్బులు బృందం శుక్రవారం నుంచి తీవ్రంగా శ్రమిస్తోంది.
బయటకు తెచ్చేందుకు మరో ప్లాన్ : భారీ పడవకు ఇనుప రోప్ కట్టి ప్రొక్లెయిన్‌తో బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఒడ్డుకు చేర్చేందుకు 3 రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేవలం 20 మీటర్ల మేర మాత్రమే బోటు వెనక్కి కదిలింది. ఒక్కోటి 40 టన్నుల పైగా బరువుండి ఒకదానితో మరొకటి లంకెపడటంతో 3 భారీ పడవలు కదలడం లేదు. ఒక పడవను బయటకు తీసే క్రమంలో ఇసుకలో చిక్కుకుపోవడంతో ఆటంకం ఏర్పడింది.
నదిలో నీటి ప్రవాహం పెరగుతుండటంతో వాటి తొలగింపు ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. వందటన్నుల బరువు లాగే ప్రొక్లెయిన్‌కు రోప్‌లు కట్టి ఒడ్డుకు చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యారేజీ ఎగువ వైపునుంచి భారీ పడవలను అధికారులు తెప్పిస్తున్నారు. చిక్కుకున్న పడవలను వాటికి కట్టి ఒడ్డుకు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.