AP YSRCP Leaders Anarchy : ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల ప్రోద్భలంతో వైఎస్సార్సీపీ నేతలు పోలింగ్ రోజు సాగించిన దమనకాండ వీడియోలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో వైఎస్సార్సీపీ మూకలు టీడీపీ ఏజెంట్లను కొట్టడం, వారి కుటుంబసభ్యుల ఇళ్లపై దాడులు చేయడం, భయపెట్టి భయానక వాతావరణం సృష్టించడం, కిరాతకంగా దాడి చేయడం వంటి దృశ్యాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
నీ సంగతి తేలుస్తా : మాచర్ల మండలం రాయవరంలో పోలింగ్ బూత్ 51లో టీడీపీ, వైఎస్సార్సీపీ ఏజెంట్లు లోపల ఉండగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇక్కడ టీడీపీకు ఓట్లు పడుతున్నాయని ఇద్దరు వైఎస్సార్సీపీ వారు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి కూర్చున్నారు. దీనిపై టీడీపీ వారు అభ్యంతరం చెప్పడంతో విధుల్లో ఉన్న ఏఎస్ఐ వైఎస్సార్సీపీ వారిని బైటకు వెళ్లిపోవాలని చెప్పారు. వైఎస్సార్సీపీ నేత జగదీష్‌కుమార్ బయటికి వస్తూ ఏఎస్‌ఐకి వేలు చూపిస్తూ 'నీ సంగతి తేలుస్తా' అంటూ బెదిరించారు.
పోలీసులు ఏజెంట్లు మినహా మిగిలినవారిని బైటకు పంపేశారు. అనంతరం అక్కడికి వచ్చిన ఎస్‌ఐ వైఎస్సార్సీపీ వారు గుంపులుగా ఉన్నా అడ్డుకోకుండా టీడీపీ వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు. టీడీపీ ఏజెంట్లు గాలి చంద్రశేఖర్, గాజుల కొండలరావు, గాజుల నాగేశ్వరరావును పోలింగ్ కేంద్రం నుంచి బైటకు పంపించి వైఎస్సార్సీపీ వారు ఏకపక్షంగా ఓట్లు వేసుకున్నారు. పోలీసులను వైఎస్సార్సీపీ నేతలు పోలింగ్ బూత్ వద్ద బెదిరిస్తున్న వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.
టీడీపీ అభ్యర్థి ఆరవిందబాబు వాహనాలపై దాడి : నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలింగ్‌రోజు అనుచరులతో పదుల సంఖ్యలో వాహనాలతో పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ హడావుడి చేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసి గృహ నిర్బంధం చేయాలని ఆదేశించింది. అయితే గృహ నిర్బంధం చేసిన నిమిషాల వ్యవధిలోనే తాను ఓటు వేయాలని కుటుంబసభ్యులతో కలిసి గుంటూరు రోడ్డులోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లకుండా పల్నాడు రోడ్డులోని మున్సిపల్ హైస్కూలు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ 11 బూత్‌లు ఉన్నాయి.
ఎమ్మెల్యే గోపిరెడ్డి పోలింగ్ కేంద్రం ఎదురుగా ఉన్న పాత ప్రభుత్వాసుపత్రిలోకి వెళ్లి అనుచరులను రెచ్చగొట్టి పోలింగ్ కేంద్రం బైట ఉన్న టీడీపీ అభ్యర్థి ఆరవిందబాబు వాహనాలపై దాడి చేయించారు. ఆరవిందబాబు వాహనం ఎక్కగానే ఆయనతోపాటు ఉన్న వాహనాలు వెళుతున్న సమయంలో వైఎస్సార్సీపీ మూకలు దాడిచేస్తూ టీడీపీ వారిని వెంటపడి కొట్టారు. ఇదే పోలింగ్ కేంద్రంలోకి నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టులో ఏజీపీగా పనిచేస్తున్న కట్టా నారపరెడ్డి తరచూ వెళ్లి వస్తుండటంతో టీడీపీ వారు అభ్యంతరం చెప్పడంతో గొడవ ప్రారంభమైంది. ఓటర్లను ప్రభావితం చేయడానికి నారపరెడ్డి వస్తున్నారని టీడీపీ వారు అభ్యంతరం చెప్పారు. వైఎస్సార్సీపీ మూకలు టీడీపీ వారిపై దాడి చేస్తుండగా నారపరెడ్డి కూడా గట్టిగా అరుస్తూ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే అనుచరులు తెలుగుదేశం నాయకులపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
సిగ్గులేదారా? టీడీపీ ఏజెంట్లను బైటకు పంపండి : మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడెంలో ఒకే పోలింగ్ కేంద్రంలో మూడు పోలింగ్‌బూత్‌లు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ, స్వతంత్ర అభ్యర్థి తరఫున కలిపి 9 మంది ఏజెంట్లు కూర్చున్నారు. పోలింగ్ సజావుగా జరుగుతుండగా మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడకు వెళ్లారు. పోలింగ్ కేంద్రం బయట కారు ఆపి బంధువైన సుబ్బారెడ్డిని పోలింగ్ కేంద్రంలోకి పంపారు. సుబ్బారెడ్డి కేంద్రం లోపలికి వెళుతూ అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి 'సిగ్గులేదారా? టీడీపీ ఏజెంట్లను బైటకు పంపండి' అంటూ కసిరారు.
లోపలికి వెళ్లి టీడీపీ ఏజెంట్లను మర్యాదగా వెళ్లిపోతే బాగుంటుందని హెచ్చరించారు. అయినా టీడీపీ ఏజెంట్లు కదలకపోవడంతో బైటకు వచ్చి వైఎస్సార్సీపీ వారికి సైగ చేయడంతో వారంతా కర్రలు, కత్తులు, రాడ్లతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి టీడీపీ ఏజెంట్లను బైటకు లాగేశారు. వారిని గ్రామంలో తరుముతూ వారి ఇళ్లపైకి వెళ్లి ఎవరు కనిపిస్తే వాళ్లను కొట్టారు. ఇళ్లను ధ్వంసం చేశారు. రేక్యానాయక్ అనే ఏజెంటును బరిసెతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన రేక్యానాయక్ పోలీసుల సాయంతో పొరుగూరికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. మిగిలిన ఏజెంట్లు గాయపడినా గ్రామంలోనే తలదాచుకున్నారు. కేపీ గూడెంలో మధ్యాహ్నం నుంచి ఏకపక్షంగా వైఎస్సార్సీపీ వాళ్లు ఓట్లేసుకున్నారు. ఎట్టకేలకు ఈనెల 16న టీడీపీ ఏజెంటు హనుమంతునాయక్ ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదైంది.