78th Independence Day Celebrations in AP : రాష్ట్రవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాల్లో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అప్పట్లో బ్రిటిష్ వారిని, వర్తమానంలో నియంతలను ప్రజలంతా ఏకతాటిపై నిలిచి తరిమి కొట్టారని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. పంద్రాగస్టు సందర్భంగా కాకినాడలో జరిగిన వేడుకుల్లో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. జెండా పండుగ సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల కోసం భారీగా నిధులు పెంచినట్లు పవన్ వెల్లడించారు.
Lokesh Speech on Independence Day : గుంటూరు పోలీసు పరేడ్ మైదానంలో మంత్రి లోకేశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులు, ఉద్యోగులకు ఆయన పురస్కారాలు ప్రదానం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని లోకేశ్ తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. రైతులకు ఏడాదికి రూ.20,000ల సాయం అందిచనున్నట్లు వివరించారు. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందించే దిశగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పింఛన్‌ను ఒక్కసారిగా రూ.4,000లు పెంచి లబ్ధిదారులకు అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.
Home Minister Anitha Flag Hoisting in Anakapalli : అందరి సహకారంతో అనకాపల్లి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జిల్లా నుంచి 350 మందికి పైగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని చెప్పారు. అంతకుముందు ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని పోలీస్ పరేడ్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసిన ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎంతోమంది మహనీయుల కృషి ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం లభించిందని సవిత పేర్కొన్నారు. అలాంటి మహనీయుల కృషి వలనే ఈరోజు మనం ఈ వేడుకలను జరుపుకుంటున్నామని చెప్పారు.
Ministers on Independence Day : అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని జెండాను ఎగురవేశారు. నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
Minister Atchannaidu Flag Hoisting in Srikakulam : శ్రీకాకుళంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతుల చట్టాన్ని రద్దు చేసి వారికి ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.
నంద్యాలలోని పీఎస్సీ, కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకలకు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.