AP High Court on Margadarsi Chit Fund Petition: ప్రైజ్‌మనీ పొందేందుకు చట్ట నిబంధనల ప్రకారం అర్హమైన పూచీకత్తు సమర్పించకపోయినా ముష్టి శ్రీనివాస్ అనే చందాదారుడికి సొమ్ము విడుదల చేయాలంటూ మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థను ఆదేశిస్తూ విజయవాడ చిట్స్ డిప్యూటీ రిజిస్ట్రార్ 2023 డిసెంబర్ 14న ఇచ్చిన అవార్డుపై హైకోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వియవాడ చిట్స్ డిప్యూటీ రిజిస్ట్రార్ జారీ చేసిన అవార్డును సవాలు చేస్తూ తాము వేసిన అప్పీల్‌పై ప్రభుత్వం (రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ-ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) స్పందించడం లేదని, ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడం లేదని, కనీసం అప్పీల్‌కు నంబరు కేటాయించడం లేదని పేర్కొంటూ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ విజయవాడ లబ్బీపేట బ్రాంచ్ చీఫ్ మేనేజరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
మార్గదర్శిపై కేసుల విచారణ నిలిపివేయాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
సదరు చందాదారుడు చిట్ పాడుకుని ప్రైజ్‌మనీ పొందేందుకు ఓ బ్యాంక్‌లో గతంలో కుదువ పెట్టిన ఓ ఆస్తిని ష్యూరిటీగా చూపించారని, ఆ బ్యాంక్ నుంచి ఆయన తీసుకున్న రుణం సైతం పారు బకాయి(Non Performing Assets)గా ఉందని కోర్టుకు తెలిపారు. మార్గదర్శి నుంచి ప్రైజ్ మనీ పొందేందుకు అలాంటి ఆస్తి ష్యూరిటీని సమర్పించారని చీఫ్ మేనేజరు పిటిషన్లో పేర్కొన్నారు. యాజమాన్యం ఆ ష్యూరిటీ అర్హమైదని కాదని స్పష్టం చేసిందన్నారు. ఆ పూచీకత్తును నిరాకరించిందని అన్నారు.
దీంతో ఆ చందాదారుడు గతేడాది తప్పుడు ఫిర్యాదు చేయగా విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఆ కేసును కొట్టేయాలని మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ నుంచి సొమ్ము ఇప్పించేలా ఆదేశించాలని చందాదారుడు విజయవాడ చిట్స్ డిప్యూటీ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించారని తెలిపారు. దీంతో సొమ్ము చెలించాలని మార్గదర్శిని ఆదేశిస్తూ డిప్యూటీ రిజిస్ట్రార్ ఏకపక్షంగా అవార్డు జారీ చేశారని పేర్కొన్నారు. ఎలాంటి విచారణ జరపలేదని, చందాదారుడు సాక్ష్యాధారాలనే సమర్పించలేదని పేర్కొన్నారు.
మార్గదర్శి ఆస్తుల జప్తు చెల్లదు- ప్రభుత్వం జారీచేసిన జీవోలు చెల్లుబాటుకావు: గుంటూరు పీడీజే కోర్టు
చట్ట నిబంధనల పరిధిదాటి చిట్స్ డిప్యూటీ రిజిస్ట్రార్ వ్యవహరించారని అన్నారు. ఆ అవార్డు చట్ట విరుద్ధని చీఫ్ మేనేజరు పిటిషన్లో తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ అవార్డుపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పీల్ వేశామని, అవార్డుపై స్టే ఇవ్వాలని కోరామన్నారు. తమ అప్పీల్‌పై ప్రభుత్వం స్పందించలేదని, ఎలాంటి విచారణ జరపలేదని అన్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించామని చీఫ్ మేనేజరు పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అవార్డుపై యథాతథ స్థితి పాటించాలని అధికారులను ఆదేశించింది.