Godavari Penna Interlinking Project : గత రెండు దశాబ్దాలతో పోలిస్తే నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతుండటంతో పల్నాడుతో పాటు సాగర్ కుడి ఆయకట్టు ప్రాంత రైతులు సాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు సాగు చేసేందుకు సైతం అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ముందుచూపుతో అప్పటి టీడీపీ సర్కార్ గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 2018లోనే పనులు ప్రారంభించింది.
అయితే వైఎస్సార్సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక దీనిని వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకంగా పేరు అయితే మార్చింది. కానీ పనులను ఇంచు కూడా ముందుకు తీసుకెళ్లలేదు. దీంతో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టి సారించింది. పల్నాడు సహా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం-బనకచర్ల అనుసంధానానికి పచ్చజెండా ఊపింది. దీంతో తొలిదశ పనుల్లో భాగంగా కృష్ణానది నుంచి సాగర్ కుడికాలువలోకి నీటిని ఎత్తిపోసే పనులు మొదలయ్యాయి.
గోదావరి- పెన్నా ప్రాజెక్టు తొలిదశ అంచనా వ్యయం సుమారు రూ.6020 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇది పూర్తయితే తొలిదశలో గుంటూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో 9,61,231 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి తర్వాత పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వద్ద కృష్ణానది నుంచి తోడి సాగర్ కుడికాలువ 80వ కిలోమీటరు నకరికల్లు మండలం నర్సింగపాడు వద్ద కాలువలోకి పోస్తారు. ఇందుకోసం ఐదుచోట్ల పంపుహౌస్‌లు ఏర్పాటు చేయనున్నారు.
కృష్ణానది ప్రవాహం నుంచి 7000ల క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోయాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనిద్వారా ఏటా 73 టీఎంసీల నీటిని సాగర్ కాలువలకు తరలిస్తారు. 56.35 కిలోమీటర్ల మేర గ్రావిటీతో కాలువ ద్వారా మరో 10.25 కిలోమీటర్లు దూరం ఎత్తిపోసేందుకు ఐదు పంపుహౌస్‌ల నిర్మాణం చేపట్టేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఈ నీటిని ఎత్తిపోసేందుకు 577.6 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు.
Godavari Penna Project in AP : ఈ ప్రాజెక్టు పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి మెగా, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీలకు గతంలోనే అప్పగించారు. ఆర్‌ఈసీ నుంచి రుణం తీసుకుని పనులు ప్రారంభించారు. నాడు అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ సర్కార్ గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. మరోవైపు భూసేకరణకు ప్రకటనలు ఇచ్చినా నిధులు మంజూరు చేయకపోవడంతో అవి రద్దయ్యాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక దీని పేరు మార్చాలని పల్నాడు జిల్లా కలెక్టర్ సర్కార్‌కు లేఖ రాశారు. దీనిపై గెజిట్ రాగానే భూసేకరణ ప్రకటన ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం కసరత్తు చేసింది. ఐదు పంపుహౌస్‌ల నిర్మాణానికి 466.35 ఎకరాలు సేకరించడానికి రూ.181 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదించింది. నిధుల విడుదలకు అనుమతిస్తూ 2024 నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
యుద్ధప్రాతిపదికన పంపుహౌస్‌ల నిర్మాణం : ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి సంస్థకు రూ.2746 కోట్ల రుణం ఇవ్వడానికి గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ఆమోదం తెలిపింది. ఈ నిధులతో ఎలక్ట్రికల్, మెకానికల్, ట్రాన్స్‌మిషన్ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే సుమారు రూ.1016 కోట్ల పనులు పూర్తిచేయడంతో బిల్లులు కూడా చెల్లించారు. మిగిలిన నిధులు అందుబాటులో ఉండటంతో యుద్ధప్రాతిపదికన పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు.
క్రోసూరులో మూడో పంపుహౌస్ పనులు మొదలయ్యాయి. మిగిలిన పంపుహౌస్ పనులు సైతం ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మాజీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గమైన సత్తెనపల్లి పరిధిలోనే ఈ ప్రాజెక్టు ఉన్నప్పటికీ ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం తప్పితే ఎన్నడూ దీనిని పూర్తి చేయడంపై దృష్టి సారించలేదని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. 2026 జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసి లక్షలాది ఎకరాలకు సాగు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
నదుల అనుసంధానానికి సహకరించండి - కేంద్రమంత్రులతో సీఎం భేటీ
ఎన్ని సవాళ్లు ఎదురైనా గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధానం - స్పష్టం చేసిన చంద్రబాబు