AP Police Constable Recruitment 2024 Updates : ఆంధ్రప్రదేశ్లో అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీయే సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి ఛైర్మన్ పీహెచ్‌డీ రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది.
AP Constable Recruitment 2022 Updates : ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన నాటి సీఎం జగన్‌మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని నట్టేట ముంచేశారు. ఆయన హయాంలో ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ పోస్టూ భర్తీ చేయలేదు. నిరుద్యోగులను నిరీక్షింపజేసి చివరికి అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత 2022 నవంబర్ 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు.
నియామక బాధ్యతను తీసుకున్న కూటమి ప్రభుత్వం : ఆ తర్వాత జగన్ మరో ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నారు. అయినా నియామక ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) నిర్వహించి, ఫలితాలు ప్రకటించినా ఆ తర్వాత దశల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అతీగతీ లేకుండా వదిలేశారు. ఎన్డీయే సర్కార్ ఆ నియామక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకుంది.
పోలీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. సిలబస్ ఏంటో చూసేయండి మరి
ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అర్హత : కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గత సంవత్సరం జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామంటూ మొదట షెడ్యూల్ విడుదల చేసి హాల్‌టికెట్లూ జారీ చేశారు. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో దానిని వాయిదా వేశారు.
ఆ ఎన్నికలైపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైఎస్సార్సీపీ సర్కార్ ఆపేసింది. దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్ జారీ కంటే రెండు సంవత్సరాల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వేరే పనులు చేసుకోలేక, ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ఊరట కలిగించేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
టీడీపీ హయాంలో మూడు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి : అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ పాలనలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబర్, డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్లు ఇచ్చారు. వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్ష అన్ని కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేశారు. అంటే 2019 ఫిబ్రవరి నాటికే ఇవన్నీ పూర్తయ్యయి. ఇప్పుడు కూడా అదే వేగంతో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.