Pawan Kalyan On SC ST Classification: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఒక వర్గం నిరంతర పోరాటానికి దక్కిన ఫలితమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే ఎస్సీల్లో ఐక్యత చెక్కు చెదరకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ పోరాటంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు అభినందనలు తెలియచేస్తున్నట్టు పవన్ వెల్లడించారు. ఈ పోరాటాలకు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఫలితం దక్కిందన్నారు.
మాదిగల రిజర్వేషన్ కల్పనకు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే -2 పాలనలో సానుకూలంగా స్పందించారని, ఇది స్వాగతించదగిన పరిణామమని అన్నారు. వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టుకు తెలియచేసిందని గుర్తు చేశారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ఒక వర్గం నిరంతర పోరాటానికి దక్కిన ఫలితం - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/cdifes8NlZ
— JanaSena Party (@JanaSenaParty) August 1, 2024
చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఓటు బ్యాంకు రాజకీయాలకు భిన్నంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు వర్గీకరణ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశంపై సుప్రీం కోర్టు తీర్పు రావటం హర్షణీయమన్నారు. వర్గీకరణకు సానుకూలంగా వచ్చిన ఈ తీర్పు ఎస్సీల్లో ఐక్యత చెక్కు చెదరకుండా చూసుకోవలసిన బాధ్యత ఎస్సీ సామాజిక వర్గ మేదావులు, విద్యావంతులపై ఉందని పేర్కొన్నారు.
రిజర్వేషన్లలో కోటా కావాలని ఒక వర్గం దశాబ్దాల తరబడి డిమాండ్ చేస్తూ, పోరాడుతూ ఉందంటే ఆ వర్గంవారిలో ఉన్న అశాంతి, వారి ఆలోచనలను కూడా గుర్తించి పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాజకీయ, సామాజిక అధ్యయనాలతో వర్గీకరణ అంశాన్ని సున్నితంగా, సునిశితంగా చూడాలన్నారు. ఎస్సీల్లోని ఉప కులాలవారు కూడా ఎదగాలని, మాదిగలకు తగిన అవకాశాలు దక్కాలని ఆకాంక్షించే సామాజికవేత్తలు, మేధావులు ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన అంశాలపై పలువురు విద్యావేత్తలు, దళిత సాహితీవేత్తలు, సామాజికవేత్తలు 2007 నుంచీ వేర్వేరు సందర్భాల్లో చర్చిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు.
ఎస్సీ ఎస్టీల్లోనూ క్రీమిలేయర్ను గుర్తించే విధానం రూపొందించాలని జస్టిస్ గవావ్ తన తీర్పులో తెలిపారని, నిజమైన సమానత్వం కోసం ఇది అవసరమని డిప్యూటీ సీఎం అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా అఖిలభారత సర్వీసు ఉద్యోగాల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారి బిడ్డలకూ రిజర్వేషన్ల ద్వారానే అవకాశాలు దక్కితే వారి సామాజిక వర్గంలోనే దిగువస్థాయిలో ఉన్నవారికి రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోతాయని దీనిపై సామాజిక వర్గ మేధావులు చర్చించాల్సిన అవసరం నేటి తీర్పు తెలియచేస్తోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
చంద్రబాబు తీసుకొచ్చిన చట్టం వల్లే న్యాయం బతికింది: మందకృష్ణ - Manda Krishna Special thanks to cbn