Pawan Kalyan Interesting Comments : గతంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే భయంగా ఉండేదని, ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిన పరిస్థితిని చూశామని చెప్పారు. పార్లమెంట్ సభ్యుణ్ని బంధించి కొట్టించిన తీరును చూసినట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ అనుభవం, సీఎంగా పని చేసిన చంద్రబాబును కూడా జైలులో పెట్టారని తెలిపారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Pawan Meet Leaders in Mangalagiri : అంతకుముందు పవన్ కల్యాణ్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు బొకేల స్థానంలో ఆయన కూరగాయల బుట్ట అందజేశారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చూశామని పవన్ పేర్కొన్నారు. ఐదు కోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని తెలిపారు. జనసేన తరఫున పోటీ చేసిన మొత్తం 21 మందిని గెలిపించారని, పోటీ చేసిన చోటే కాకుండా చేయని చోట్లా వీర మహిళలు, జనసైనికులు తీవ్రంగా పోరాడారని చెప్పారు.
'బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటా. జన సైనికులు, వీర మహిళలు నావైపు బలంగా నిలబడ్డారు. ఎలాంటి పదవి ఆశించకుండా జనసైనికులు పోరాడారు. ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం. ఊహించని మెజారిటీలతో గెలవడం గొప్ప విషయం. వైఎస్సార్సీపీ సహా ఏ పార్టీ వారైనా ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు. చేతగాక కాదు కక్షసాధింపు చర్యలు ఎవరికీ మంచిది కాదు. వైఎస్సార్సీపీ చేసిన తప్పులు మనం చేయకూడదు. అలాగని ఆ పార్టీ చేసిన తప్పులు సహించలేం. చట్టపరంగా చర్యలుంటాయి' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
"నేను ముఖ్యమంత్రి అవుతానని ఆశించలేదు. నేను పదవి కోరుకోలేదు, కానీ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములమయ్యాం. అధికారం కోసం కాదు, ప్రజల కోసం పోరాటం చేశాం. జనసేన తీసుకున్న మంత్రి పదవులు కూడా ప్రజలతో నిత్యం సంబంధం ఉన్నవి. జనసేన ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలి. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. నా కార్యాలయం ఏర్పాటుకు కూడా రూపాయి ఖర్చు వద్దని చెప్పాను. ఉన్న సౌకర్యాలు చాలు, నా కోసం కొత్తగా వద్దని చెప్పా." - పవన్ కల్యాణ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి
రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూపొద్దు : పార్టీ పటిష్ఠత కోసం అందరూ పని చేయాలని, ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో ప్రతి రోజూ ఒకరైనా అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కావాలన్న ఆయన, బలవంతంగా వారసులను రుద్దవద్దని, రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూపొద్దని పార్టీ నేతలకు తెలిపారు. పార్టీ నేతలను సామాజిక మాధ్యమాల్లో దూషించిన ఘటనలు తన దృష్టికి వచ్చాయని, అలాంటి నాయకులు తనకు అవసరం లేదని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
మహిళా నేతల పట్ల అగౌరవంగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రజలు తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారన్నారు. విదేశాల నుంచి కూడా వచ్చి కూటమికి ఓట్లు వేసిన విషయం మర్చిపోవద్దని తెలిపారు. ఈ క్రమంలోనే కాలం చాలా గొప్పదని, విర్రవీగిన వాళ్లకు 11 సీట్లతో సమాధానం చెప్పిందని వివరించారు. వాళ్లకు అలా జరిగినప్పుడు తాము ఎంత అప్రమత్తంగా ఉండాలో ఆలోచించాలని, పార్టీలో అంతా బలంగా నిలబడ్డాం కాబట్టే ఎన్డీయే కూటమి కూడా బలోపేతమైందని పవన్ కల్యాణ్ వివరించారు.
పిఠాపురంలోనే సెటిల్ కానున్న పవన్ కల్యాణ్! - ఇంటి కోసం భూమి కొన్న జనసేనాని