AP Deputy CM Pawan Kalyan About Gifts : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గురువారం పార్టీ ఎంపీలతో పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు బాలశౌరీ, ఉదయ్ శ్రీనివాస్‌లు పవన్‌కు కూరగాయలను అందించారు. తనను కలిసే నాయకులు బొకే, శాలువాలు, బహుమతులు తీసుకు రాకుండా పేదలకు ఉపయోగపడేలా కూరగాయలు, ఇతర వస్తువులను తీసుకరావాలని కోరారు.
ఆ కూరగాయలను త్వరలో ప్రభుత్వం ప్రారంభించే అన్న క్యాంటీన్లకు పంపిస్తామని తనను కలిసిన ఎంపీలకు చెప్పారు. కళ్లకు ఇంపుగా కనిపించేవి, కనులకు నిండుగా కనబడేవి కాదని పది మందికి కడుపు నింపేవి తీసుకువస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తనకు కూరగాయలు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు.
ఆ ఎమ్మెల్యేలిద్దరినీ ప్రభుత్వ విప్‌లుగా ప్రకటించండి - చంద్రబాబుకు పవన్ లేఖ
Pawan Kalyan Guidelines to MPs : ఈనెల 22న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించాలని ఎంపీ బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్‌లకు పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు. మానవనరుల అభివృద్ధి, టూరిజం వంటి ముఖ్యాంశాలను పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే, ఎక్కువ ఉద్యోగ అవకాశాలున్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, సేవా రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలపై బాగా దృష్టి సారిస్తే మెరికల్లాంటి యువ శాస్త్రవేత్తలు బయటకి వస్తారని, కొత్త ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
అవకాశాలు, మార్గాలు లేక యువత పరిశోధనా రంగం వైపు రాలేకపోతున్నారని, ప్రభుత్వం సరైన దిశగా వారికి అవకాశాలు కల్పిస్తే స్వల్ప ఖర్చుతో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. ఏదైనా ఒక పథకం సాధించినప్పుడు అది వ్యక్తిగతంగా కాకుండా ఎన్డీఏ కూటమి పక్షాన, జనసేన పక్షాన సాధించుకున్నట్టు చెప్పడం మనలోని సమష్టితత్వాన్ని వెల్లడిస్తుందని వ్యక్తులకు రావలసిన పేరు ప్రతిష్ఠలకు సంబంధించి సందర్భోచితంగా ప్రతిస్పందిస్తానని వెల్లడించారు.
ఇద్దరు ఎంపీలతోపాటు నాతో సహా మొత్తం 21 మంది శాసనసభ్యులు నెలలో ఒక రోజైనా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఒక పూట తమ నియోజకవర్గాల నుంచి వచ్చే వారికి, మరోపూట అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వారిని కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ నిబంధనను తక్షణమే ప్రతి ఒక్కరు అమలు పాటించాలన్నారు.
పిఠాపురంలోనే సెటిల్ కానున్న పవన్ కల్యాణ్! - ఇంటి కోసం భూమి కొన్న జనసేనాని