CM Chandrababu Inspected Budameru Canal Breach : రాజకీయ ముసుగులో మాట్లాడుతున్న నేరస్థుల ముసుగు తొలగిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. నేరస్థులుగా ప్రజలముందు నిలపెడతానని స్పష్టం చేశారు. బుడమేరు గండి పడిన ప్రదేశాలను సీఎం పరిశీలించారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహం నగరాన్ని ముంచెత్తిన తీరును అధికారులు సీఎంకు వివరించారు. నేర సామ్రాజ్యం విస్తరణకు రాజకీయ ముసుగు తొడిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వరదలపై యుద్ధంలో గెలిచినా, జరిగిన నష్టాన్ని మాత్రం పూడ్చలేకపోయామని సీఎం అన్నారు.
జరిగిన నష్టాన్ని అధ్యయనం చేస్తున్నాం : రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అంతిమంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేసి, అంతా నిలదొక్కుకునే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. వాహనాల స్పేర్ పార్ట్స్ కూడా 100 శాతం సబ్సిడీ ఇచ్చేలా కంపెనీలతో మాట్లాడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బుధవారం ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు తెలిపారు. అధికవర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తానన్నారు. విశాఖ, ఏలేరు ప్రాజెక్టు ప్రాంతాల్లో తిరిగి ఎల్లుండి నందివాడ, కొల్లేరుల్లో తిరిగి బాధితుల్ని పరామర్శించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
ప్రజలపై విద్వేషంతో జగన్ చేసిన జాతి ద్రోహం ఫలితమే విజయవాడ ముంపునకు కారణమని చంద్రబాబు మండిపడ్డారు. వరదలపై 10రోజుల పాటు అహర్నిశలూ శ్రమించి ఓ పెద్ద యుద్ధమే చేశామని అన్నారు. ఓ దుర్మార్గుడు నిర్లక్ష్యం ఎంతమంది పాలిట శాపమో బుడమేరు ఉగ్రరూపమే ఓ పాఠమని మండిపడ్డారు. బుడమేరకు విజయవాడ నగరం వైపు పడిన 3 గండ్లను గత ప్రభుత్వం పూడ్చలేదని దుయ్యబట్టారు. బుడమేరు దాల్చిన ఉగ్రరూపంతో ఈ నీరు నగరాన్ని ముంచెత్తటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తిందని ఆక్షేపించారు. మరోవైపు పులివాగు కూడా వచ్చి ఇక్కడే కలిసిందన్నారు.
అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు : ఆర్మీ కూడా చేతులెత్తేసే పరిస్థితుల్లో మంత్రి రామానాయుడు నేతృత్వంలోని బృందం అహర్నిశలు పనిచేసి గండ్లు పూడ్చారని గుర్తుచేశారు. మరో మంత్రి లోకేశ్ వివిధ శాఖల్ని సమన్వయం చేస్తూ తెరవెనుక ఎంతో కృషి చేశారని కొనియాడారు. బుడమేరుపై అక్రమ కట్టడాలు కట్టి రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో నీరు దిగువకు పారని పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు వివరించారు.
గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికే 2 నుంచి 3రోజుల సమయం పట్టిందన్నారు. ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చి గండ్లు పూడ్చారని సీఎం వెల్లడించారు. అయినా కొన్ని లీకేజీలు ఉండటం వల్ల ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బుద్ధి లేకుండా బోట్లు వదిలి బ్యారేజీకి ముప్పు తెచ్చే కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్రాంతి తీసుకోకుండా రాత్రిపగలు పని చేసిన అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు.
ఏపీలో వరద సృష్టించిన బీభత్సం - కర్షకుల కష్టం 'కృష్ణా'ర్పణం - AP FLOODS EFFECT 2024