AP CM Chandrababu Reaction On Tirumala Laddu Ghee Row : ప్రపంచవ్యాప్తంగా తిరుమల దేవస్థానానికి ఎంతో విశిష్ఠత ఉందని, ఇప్పటి వరకూ పాలకులెవ్వరూ దాని పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరుమల వేంకటేశ్వరస్వామిని కూడా వదల్లేదని మండిపడ్డారు. ఎందరికో స్ఫూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో గత 5 ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేశారని ధ్వజమెత్తారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల ఆలయాన్ని మార్చారని దుయ్యబట్టారు. ఏపీలోని ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అందరి అకౌంట్లను స్వామివారే సెటిల్ చేస్తారు : రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని ఆయన గుర్తుచేశారు. తనకు వ్యక్తిగతంగానూ తిరుపతి శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని చెప్పారు. అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడటం స్వామివారు చేసిన అద్భుతమే తప్ప, ఆ బ్లాస్ట్‌లో ప్రాణాలతో బయటపడటమనేది అసాధ్యమన్నారు. శ్రీవారు అందరి అకౌంట్లు ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తారని, అది ఆయన మహత్యమని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో భక్తుల మనోభావాలకు విలువలేదని, వారి సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు.
రివర్స్ టెండరింగ్ పెట్టి లడ్డూ నాణ్యత దెబ్బతీశారు : తిరుమల లడ్డూ నాణ్యత, సువాసనకు ఎంతో విశిష్ఠత ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. స్వామి మహత్యం ఉంది కాబట్టే ఎంతో మంది లడ్డూని కాపీరైట్ చేయాలనుకున్నా చేయలేకపోయారని, అంతటి ప్రాముఖ్యత ఉన్న లడ్డూకి వాడే పదార్థాలకు రివర్స్ టెండరింగ్ పెట్టి నాణ్యత దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం వారికి గేట్లు తెరిచినట్లుగా రివర్స్ టెండరింగ్ నిబంధనలు మార్చేశారని అసహనం వ్యక్తం చేశారు.
ఫలితంగా ప్రధాన సంస్థలు ఏవీ టెండరింగ్ ప్రక్రియలో పాల్గొనలేక పోయాయన్నారు. వైఎస్సార్సీపీ వచ్చీ రావడంతోనే ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీశారని, ట్రస్టు బోర్డుల నియామకాలు ఓ గ్యాంబ్లింగ్‌గా మార్చేశారని మండిపడ్డారు. ఇష్టానుసారంగా వీఐపీ టిక్కెట్లు అమ్ముకోవడం సహా తిరుమలకొండపై వ్యాపారాలు చేశారని ఆరోపించారు. అన్య మతస్తులను టీటీడీ ఛైర్మన్‌గా వేశారని, రాజకీయ కేంద్రంగా దేవస్థానం బోర్డుని వాడుకున్నారని దుయ్యబట్టారు. తిరుమల అన్నదానంలో భోజనం చేస్తేనే ఓ ప్రత్యేక అనుభూతి కలిగేవిధంగా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
అలా చేయడం క్షమించరాని నేరం : ఎన్‌డీడీబీ రిపోర్ట్ ద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతింటే, ఎదురుదాడితో తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూడటం క్షమించరాని నేరమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నివేదిక వాస్తవాలను తాను కప్పిపుచ్చి తారుమారు చేసి బయట పెట్టాలని జగన్ కోరుకుంటున్నాడా? అని నిలదీశారు. ఎదురుదాడితో ప్రజలు చేసిన అపచారం మర్చిపోతారనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆ నివేదిక బయట పెట్టకపోతే ప్రజలకు వాస్తవాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాల్సిన లడ్డూ త్వరగా పాడవటం, రంగు మారటం వంటి పరిణామాలు చూశామని చెప్పారు. లడ్డూ రుచి చూసిన వారెవ్వరైనా నాణ్యత లేదని ఇట్టే చెప్పేవారన్నారు.
తిరుమల దేవస్థానం ప్రక్షాళనకు దేవుడు తనకొక అవకాశం ఇచ్చారని, శ్యామలరావుకి చెప్పి, అందుకనుగుణంగా పనిచేయాలని చెప్పి ఈవోగా నియమించినట్లు చంద్రబాబు వివరించారు. లడ్డూ నాణ్యతపై అనుమానంతోనే 4 ట్యాంకర్లను ఎన్‌డీడీబీ పరీక్షలకు పంపామని, ల్యాబ్‌లో పరీక్షల తర్వాత ఎస్ వాల్యుల్లో భారీ వ్యత్యాసాలు వెలుగు చూశాయని ఆయన వెల్లడించారు. వెంటనే ఈవో సదరు సంస్థలకు నోటీసులు ఇచ్చి, బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం వంటి చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తించారని వెల్లడించారు. తదుపరి చర్యలకు నిపుణుల కమిటీ కూడా వేసి మళ్లీ టెండర్లును ఆహ్వానించారన్నారు. అధికారం చేపట్టాక ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకుని ఎన్నో వాస్తవాలు వెలుగు చూశాయన్నారు.
Chandra Babu Fires On YS Jagan : చేసిన తప్పుని సమర్ధించుకుంటూ ప్రధానికి లేఖ రాయటానికి జగన్‌కి ఎంత ధైర్యమని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ ముసుగులో వచ్చిన నేరస్థుడు కాబట్టే జగన్‌ను ఎస్కోబార్ అన్నానని గుర్తుచేశారు. ఎంతో అపచారం చేసి సమర్ధించుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారని నిలదీశారు. నిన్నటి నుంచి ఒక్కొక్క స్టేట్‌మెంట్ చూస్తుంటే కడుపు రగిలిపోయి ఆవేశం వస్తోందని మండిపడ్డారు. టీటీడీ ఛైర్మన్‌గా ఇంతకు ముందు చేసిన వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుని తిరుగుతుందని గుర్తుచేశారు.
మరో మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన తన ఇంట్లో పెళ్లిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశాడన్నారు. సీఎంగా ఉన్నంతవరకు మతసామరస్యాన్ని కాపాడడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. తనకు నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం తన కర్తవ్యమని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎదురు దాడి చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 3.75 లక్షల వీఐపీ టిక్కెట్లు ఇచ్చుకున్నారని ఆక్షేపించారు.
తిరుపతి లడ్డూ నాణ్యత పునరుద్ధరించిన టీటీడీ - ఇక నో టెన్షన్ - TTD Laddu Updates