Land Titling Act Repeal Bill : ల్యాండ్ టైటిలింగ్ బిల్లు రద్దుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బిల్లును సభలో ప్రవేశపెట్టగా సభ్యులు అందరూ ఏకగ్రీవంగా సమ్మతి తెలిపారు. ప్రజల హక్కుల్ని హరించే ఈ బిల్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని సభ్యులు స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ బిల్లుని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నెరవేర్చుకుంది. ఈ మేరకు బుధవారం సభలో ల్యాండ్ టైటిలింగ్ బిల్లు రద్దును ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు. పేదల భూముల్ని లాక్కునేందుకే గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందన్న మంత్రి అప్పీలుకు హైకోర్టుకు వెళ్లాలనే నిబంధన దుర్మార్గమన్నారు.
గత ఐదేళ్లలో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అయ్యాయన్న ఏపీ మంత్రి ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కబళించాలనే ఆలోచనతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తెచ్చారన్నారు. కోర్టుల జోక్యమే లేకుండా టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పేరిట ఎవరైనా వ్యక్తిని నియమించేలా నిబంధనలు మార్చారని విమర్శించారు. అందుకే చట్టం రద్దుకు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. మంత్రి ప్రతిపాదనను జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సమర్థించారు. చట్టం రద్దుతో ప్రజలు మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు.
ఆలోచించకుండా ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు : ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని భూములన్నింటనీ కొట్టేయాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ చట్టాన్ని తెచ్చారన్నారు. నీతిఆయోగ్ చెప్పలేని నిబంధనల్ని కూడా చట్టంలో చేర్చారని విమర్శించారు. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది భయంకరమైన చట్టం, ఏమాత్రం ఆలోచించకుండా చట్టాన్ని తీసుకొచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ చట్టం తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసిందని, ప్రజలను చైతన్యవంతులను చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళన చేశారని ఏపీ సీఎం తెలిపారు. ఈ చట్టం అమలులోకి వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి వచ్చేదని, ఇప్పటికే రాష్ట్రంలో భూ వివాదాలు పెరిగిపోయాయి, గత ఐదేళ్లలో చాలా అవకతవకలు జరిగాయని తెలిపారు.
సీఎం ఫొటో వేసుకుని పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇస్తారా : ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల పౌరుల ఆస్తి లాగేసే పరిస్థితి వస్తుందన్న చంద్రబాబు, నేరస్థుల వద్ద టెక్నాలజీ ఉంటే రికార్డులు మార్చడం చాలా సులభం అని పేర్కొన్నారు. భూమి అనేది తరాతరాలుగా వారసత్వం నుంచి వస్తుందని, ప్రభుత్వ ముద్ర వేసి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీ అని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం ఫొటో వేసుకుని పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇస్తారా? అని ప్రశ్నించారు.
ఇటీవల భూసర్వే అన్నారు, ఎక్కడికక్కడ వివాదాలు పెంచేశారు, పేద రైతులకు ఇబ్బంది వస్తే నేరుగా హైకోర్టుకు వెళ్లాలా? వివాదాలు వస్తే పెద్ద లాయర్‌ను పెట్టుకునే స్థోమత ఉంటుందా? అని ఏపీ సీఎం నిలదీశారు. వివాదాలు పరిష్కారం చేయకుండా మరింత పెంచుతున్నారని, చట్టాన్ని అమలులోకి తెస్తూ జారీచేసిన జీవో నం.512 రహస్యంగా దాచిపెట్టారని తెలిపారు. చాలా ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అధికారంలోకి రాగానే రద్దుచేస్తామని మాట ఇచ్చామని, దాన్ని నిలబెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.