Telugu States CMs Meeting in Hyderabad : విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సుహృద్భావ వాతావరణంలో జరిగింది. సుమారు రెండు గంటలు జరిగిన ఈ భేటీలో ఇరు రాష్ట్రప్రభుత్వాల వినతులు, విజ్ఞప్తులు అధికారికంగా ఇచ్చిపుచ్చుకున్నారు.
అంతకు ముందు ఇరు రాష్ట్రాల సీఎంల రాక కోసం ప్రజాభవన్ అధికారులతో సందడిగా మారింది. జూబ్లీహిల్స్ నుంచి ప్రజాభవన్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత ఇరువురు ముఖ్యమంత్రులు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. తరువాత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బొకే అందించారు.
చంద్రబాబుకు 'నాగొడవ' పుస్తకాన్ని బహుకరించిన రేవంత్ రెడ్డి : సమావేశం జరిగే గదిలోకి వెళ్లిన తరువాత చంద్రబాబును రేవంత్ రెడ్డి శాలువతో సత్కరించారు. ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు రాసిన 'నా గొడవ' పుస్తకాన్ని బహుకరించారు. అటు తరువాత చంద్రబాబు ఏపీ ప్రభుత్వం తరుపున వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో ఉన్న జ్ఞాపికను సీఎం రేవత్, డిప్యూటీ సీఎం భట్టిలకు అందజేశారు. అనంతరం వారిరువురిని శాలువతో సత్కరించారు.
తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల మీటింగ్‌కు వేదికైంది. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. విభజన సమస్యసను పరిష్కరించుకుందామని చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు రేవంత్ రెడ్డి అంగీకరించడంతో ప్రజా భవన్ వేదికగా ఇవాళ్టి సమావేశం జరిగింది. సుమారు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో 10 షెడ్యూల్లోని అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. వీలైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఇందుకోసం అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు.