TGNAB New Police Stations in Hyderabad : రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల రవాణా, సరఫరా, వినియోగం పెరుగుతోంది. రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తురిస్తున్న డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. ఇప్పటికే ఏర్పాటైన తెలంగాణ యాంటి నార్కొటిక్స్ బ్యూరో-టీజీన్యాబ్ డ్రగ్ నేరగాళ్లను ఏరివేస్తోంది. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌కి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో గంజాయి, మత్తుపదార్ధాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆ విషయంలో మరింత యాక్టివ్‌గా పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోకి మత్తుపదార్ధాలు రాకుండా సరిహద్దుల్లో గట్టి నిఘాఏర్పాటు చేయాలన్న సీఎం, గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్‌కి బ్రేక్ వేయాలని ఆదేశించారు. వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలని స్పష్టంచేశారు. మత్తుపదార్ధాల కేసులో ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించొద్దని స్పష్టంచేశారు.
ఇప్పటికే టీజీన్యాబ్ పనితీరును సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. డైరెక్టర్‌గా ఉన్న సందీప్ శాండిల్యా పదవీకాలం పూర్తవుతుండగా మరోఏడాది పాటు ఆయన సేవలను వినియోగిచుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. టీజీన్యాబ్ కోసం రాష్ట్రంలో నాలుగు నార్కొటిక్ ఠాణాలు ఏర్పాటుచేస్తున్నారు. సైబరాబాద్,రాచకొండ, హైదరాబాద్, వరంగల్‌లో పోలీస్‌స్టేషన్లు సిద్దమవుతున్నాయి. కేసులు నమోదు చేసేందుకు కోర్టు అనుమతి లభించడంతో వేగంగా పనులు పూర్తవుతున్నాయి.
ప్రతిఠాణాకి ఎస్‌హెచ్‌వోగా ఇప్పటికే డీఎస్పీని కేటాయించారు. హైదరాబాద్ నార్కొటిక్ ఠాణాను నాంపల్లిలోని హైదరాబాద్ పాతకలేక్టరేట్ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే భవనాన్ని అధునీకీకరణ చేస్తున్నారు. సైబరాబాద్ నార్కొటిక్స్ ఠాణా కోసం హఫీజ్ పేటలో కొంతస్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. రాచకొండ నార్కొటిక్స్ ఠాణాకు సరూర్‌నగర్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్ సమీపంలోని స్థలం కేటాయించారు.
రాచకొండ, సైబరాబాద్ భవనాలు పూర్తయ్యే వరకి హైదరాబాద్ నార్కొటిక్స్ ఠాణా ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ సహా సాధారణ పోలీస్‌స్టేషన్లలో డ్రగ్స్ విక్రయం, సరఫరా, వినియోగంపై కేసులు నమోదుచేస్తున్నారు. ఇక నుంచి వాటితోపాటు నార్కొటిక్ పోలీస్టేషన్లు కేసులు నమోదు చేస్తాయి. సాధారణ స్టేషన్లలో కేసు తీవ్రతని బట్టి టీజీన్యాబ్ దర్యాప్తు చేయనుంది. పరిస్థితిని బట్టి కేసుని నార్కొటిక్ ఠాణాకి బదిలీచేసే అవకాశం ఉంది.
మరో 25 రోజుల్లో ఆ పోలీస్‌స్టేషన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఉన్నతాధికారులు తెలిపారు. అందుకోసం అవసరమైన సిబ్బందిని త్వరలో ఠాణాలకు ఆటాచ్‌చేస్తామని చెబుతున్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదంమోపుతున్న పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 2021 లో 1331 కేసులు నమోదుచేయగా 2వేల919 మందినిందితులని అరెస్ట్‌చేశారు. 95.5కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఈఏడాది ఇప్పటివరకు 669 కేసులు నమోదుచేయగా 1321 మందిని అరెస్ట్ చేసి 69.69కోట్ల విలువైన మత్తు పదార్ధాలు, విక్రేతల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకి పట్టుబడిన డ్రగ్స్‌లో 16 కోట్ల 84లక్షల విలువైన గంజాయి, 3 కోట్ల 32లక్షల విలువైన ఓపియం, 48 కోట్ల విలువైన ఆల్పాజోలం సహా ఇతర మత్తుపదార్ధాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
మా అసోసియేషన్ కీలక నిర్ణయం - సినీ నటి హేమ సస్పెండ్! - Maa Association Suspend Hema