Annual Cyber Security Summit Hyderabad : సైబర్ నేరాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో వార్షిక సైబర్ సెక్యురిటీ సమ్మిట్ - హాక్-2.0 ను ప్రారంభించిన మంత్రి నిపుణుల సలహాలు, సూచనలు, సైబర్ సెక్యూరిటీలో కీలకం అవుతాయని అన్నారు. సదస్సులో సైబర్ నేరాలపై అవగాహన కోసం చిత్రీకరించిన వీడియోలను విడుదల చేసిన మంత్రి తమ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
సైబర్ నేరాల నియంత్రణపై సమ్మిట్ : హైదరాబాద్‌లో వార్షిక సైబర్ సెక్యురిటీ సమ్మిట్ హాక్-2.0 ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ సదస్సులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షిఖా గోయల్, మహారాష్ట్ర అదనపు డీజీ బ్రిజేష్ సింగ్ పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు, తీసుకుంటున్న చర్యలు, నేరాల నియంత్రణకు వాడుతున్న సాంకేతిక విధానం, ప్రజల అప్రమత్తతపై నిపుణులు చర్చించారు. సైబర్ నేరాల కట్టడికి పోలీసులకు ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపైనా నిపుణులు ప్రసంగించారు. నేరాలపై అవగాహన కోసం ప్రత్యేకంగా వీడియోలు, నాటికలు, నృత్యాలు ప్రదర్శించారు. సదస్సులో సైబర్ నేరాలపై అవగాహన కోసం చిత్రీకరించిన వీడియోలను మంత్రి విడుదల చేశారు.
25 రకాల నేరాలు పదే పదే చేస్తున్నారు : సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీధర్‌బాబు నిపుణుల సలహాలు, సూచనలు సైబర్ సెక్యూరిటీ లో కీలకం అవుతాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రియల్ గ్లోబల్ సైబర్ సిటీగా రూపొందుతోందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది సైబర్ నేరాలు 24శాతం పెరిగాయన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇందులో 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతుండగా 25రకాల నేరాలకు పదే పదే పాల్పడుతున్నారని తెలిపారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్‌ల పేరిట జరుగుతున్న నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది 35కోట్ల 8 లక్షలను బాధితులకు ఇప్పించాం : ఇతర రాష్ట్రాలకు వెళ్లి నేరగాళ్లను అరెస్ట్ చేయడం సవాల్‌గా మారిందన్న సీపీ అక్కడికి వెళ్లినప్పుడు స్థానికులు దాడులు చేస్తుండటం పట్ల విచారం వ్యక్తం చేశారు. సైబర్ సెక్యురిటీ బ్యూరో ఏర్పాటుతో బాధితులకు సొమ్ము తిరిగి అప్పగిస్తున్నామన్న సీవీ ఆనంద్ ఈ ఏడాది 35కోట్ల 8 లక్షల రూపాయల్ని బాధితులకు తిరిగి ఇప్పించినట్టు తెలిపారు.
ఏఐని ఉపయోగించి సైబర్ నేరాల్ని కట్టడికి ఉన్న అవకాశాల్ని అన్వేషించాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు. సదస్సులో నేరాల నియంత్రణ, అవగాహన కోసం ప్రదర్శించిన వీడియోలు, నాటకాలు, నృత్యాలు ఆలోచింపజేశాయి.
ఆన్లైన్లో లోన్ తీయించి మరీ రూ. 30 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
మీ వాట్సప్‌కు వచ్చే ఏపీకే ఫైల్ లింక్ క్లిక్ చేస్తున్నారా ? - అయితే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్లే