Fish medicine in Hyderabad : చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తూ ఆపన్నహస్తం అందిస్తున్నాయి. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు అందించే చేప మందు పంపిణీకి ఇతర రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు, వారి బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారికి బసవ కేంద్ర చార్కామన్ సంఘం భోజన ఏర్పాట్లను చేసింది. రెండు రోజుల పాటు ఎంత మంది వచ్చిన వారికి భోజనం అందిస్తామని సంఘం అధ్యక్షుడు నాగ్ నాత్ మశాట్టే తెలిపారు. చేప మందు పంపిణీకు టోకెన్లను ఇవాళ నుంచే విక్రయిస్తుండటంతో ఒక రోజు ముందే చాలా మంది ఇప్పటికే ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు.
Fish medicine Distribution Arrangements : మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేప మందు పంపిణీకి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. శనివారం ఉదయం చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. టోకెన్ల కోసం ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్ మెట్టు సాయికుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గత ఏడాది కంటే ఈ సారి చేప మందు తీసుకునేందుకు ప్రజలు ఎక్కువగా తరలివచ్చే అవకాశం ఉన్నందున మత్స్యశాఖ నుంచి లక్షా 60 వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు సాయికుమార్ తెలిపారు.
Special Buses for Fish Medicine : చేప మందు కోసం వచ్చే వారి కోసం 130 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రధాన రైల్వే స్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జూబ్లీహిల్స్, ఎంజీబీఎస్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది.
"దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. పలు స్వచ్చంధ సంస్థలు భోజన ఏర్పాట్లు చేశాయి. రేపటి చేప మందు పంపిణీకు టోకెన్లను ఈరోజు నుంచే విక్రయిస్తున్నాం. చాలా మంది ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకుంటున్నారు." - మెట్టు సాయికుమార్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్