Andhra Pradesh TET Schedule 2024 Revised : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేసిన సర్కార్ అందుకు అనుగుణమైన నిర్ణయాలు చకచకా తీసుకుంటోంది. డీఎస్సీకి ముందు నిర్వహించే టెట్‌కు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించగా ఆ షెడ్యూల్‌ను ఇప్పుడు సవరించింది. ఆగస్టు 3 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది.
అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, నవంబర్ 2న ఫలితాలు విడుదల అవుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జులై 2న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్, డీఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.
AP TET 2024 Postponed : ఈ నేపథ్యంలో టెట్ షెడ్యూల్‌లో పలు మార్పులతో సోమవారం సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే. ఏపీ టెట్ సిలబస్ గురించి అపోహలు వద్దని విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ సూచించారు.
సిలబస్ ఆధారంగానే సన్నద్ధం కావాలి : టెట్ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, షెడ్యూల్, సిలబస్ వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 2024 టెట్ సిలబస్ ఆధారంగా పరీక్షకు అభ్యర్థులు సన్నద్ధం కావాలి పేర్కొన్నారు. పాత సిలబస్ ఆన్‌లైన్‌లో ఉంచినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అభ్యర్థులు ఎలాంటి అపోహలు పడొద్దన్నారు.
ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్ సిలబస్‌నే ప్రస్తుత టెట్‌కు కూడా నిర్ధారించామని, అందువలన దానిని వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు టెట్‌కు సన్నద్ధం కావాలని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
డీఎస్సీ పరీక్షలు యథాతథం - ఈ నెల 11న హాల్‌టికెట్లు విడుదల : విద్యాశాఖ - TG DSC As Per Schedule