Free Cylinder Distribution in AP : ఏపీ ప్రభుత్వం దీపం-2 పథకం ద్వారా దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్ 29 నుంచి మార్చి 31, 2025 వరకు మొదటి ఉచిత సిలిండర్ కోసం బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు నెలలకోసారి ఉచిత సిలిండర్ అందిస్తామని, సిలిండరు ఇంటికి చేరిన 48 గంటల్లోగా వినియోగదారు ఖాతాలో రాయితీ జమ అవుతుందని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత అవసరాల కోసం రుషికొండపై విలాసవంతమైన రాజభవన్ కట్టుకున్నారని గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి, ఏపీ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. పర్యాటకంలో ఏపీ మూడో స్థానంలో ఉందని, మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 9న శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీ ప్లేన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు. స్వదేశీ దర్శన్-2లో సూర్యలంక బీచ్‌ను ఐకానిక్ ప్రాజెక్టుగా చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరు ఛానల్‌తో పాటు ఏపీలోని పలు ఛానళ్ల ఆధునికీకరణకు నిధుల సమీకరణకు ముందుకెళ్తున్నట్లు వివరించారు.
ఇవి ఉంటే చాలు ఫ్రీ గ్యాస్ : ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన సబ్సిడీ నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఒక సిలిండర్ సబ్సిడీ మొత్తం రూ.895 కోట్ల విడుదలకు ఏపీ సర్కార్ అనుమితి ఇచ్చింది. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.2684 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. సంయుక్తంగా గ్యాస్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ తెరచిన ఖాతాకే ఈ మొత్తం నిధులను జమ చేయనుంది.
ఉచిత సిలిండర్‌కు సంబంధించిన నిధులు డీబీటీ ద్వారా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా నగదు బదిలీతో నేరుగా లబ్ధిదారు ఖాతాకు జమ చేయనుంది. ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుంది. ఈ మేరకు ఏపీలో దాదాపు కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నారు.
రేపటి నుంచే ఫ్రీ గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ - పథకానికి అర్హులు ఎవరంటే?