AP Vote on Account Budget Ordinance: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో మంత్రుల నుంచి ఆమోదం తీసుకున్న ప్రభుత్వం, గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి బుధవారంతో ముగియనున్న దృష్ట్యా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సును జారీ చేసింది. 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ప్రభుత్వం మంత్రుల నుంచి ఆమోదం తీసుకుంది. సుమారు లక్షా 30 వేల కోట్ల మేర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం వచ్చేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు ఇచ్చింది.
అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు 1100 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్‌కు నిధులు కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో 2 నెలలు సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది.
పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు - ఆగస్టు 15న తెరుచుకోనున్నాయి - Anna Canteens to be reopened
CM Chandrababu Review on Social Welfare Department: మరోవైపు దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సాంఘిక సంక్షేమ శాఖను ఆదేశించారు. సచివాలయంలో ఆ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, సివిల్ సర్వీస్ శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్, చంద్రన్న పెళ్లికానుక వంటి పథకాల ద్వారా వేల కుటుంబాలకు లబ్ది చేకూరిందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకాలను నీరుగార్చిందని సీఎం అన్నారు. బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఉపయోగపడే, వారిని పేదరికం నుంచి బయటపడేసే పథకాలను రద్దు చేయడం వల్ల ఆ వర్గానికి తీరిని నష్టం జరిగిందని అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేటాయాంచిన నిధుల్లో 83 శాతం ఖర్చు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం 67 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేశారని అధికారులు వివరించారు. రోజూవారీ కష్టంపై బతికే, అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరం ఉందని, వారిని పేదరికం నుంచి బయట పడేసేందుకు అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని సీఎం అన్నారు. విద్య, ఉపాధి అవకాశాల ద్వారా వారి జీవితాల్లో మార్పులు తేవచ్చని చందబాబు పేర్కొన్నారు.