AP Deputy CM Pawan Kalyan on Tirumala Srivari Properties : తిరుమల వేంకటేశ్వరస్వామి ఆస్తులను పరిరక్షించాల్సింది పోయి వాటిని పప్పుబెల్లాల్లా అమ్మడానికి గత పాలక మండలి ఎందుకు ఉత్సాహ పడిందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పాలక మండళ్లకు గతంలో నేతృత్వం వహించిన వారు శ్రీవారి ఆస్తులను కాపాడారా లేదా ఆమ్మేశారా అని అడిగారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా సేకరించిన నిధులను ఏం చేశారని, ఆస్తులను అమ్మేదిశగా పాలక మండళ్లను నడిపించిందెవరు అని నిలదీశారు. విచారణ చేసి వీరందరినీ బయటపెడతామని ఉద్ఘాటించారు.
టీటీడీ ఆస్తుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. శతాబ్దాలుగా రాజులు, భక్తులు సమర్పించిన నగలు, ఆభరణాలనూ పరిశీలించాలని, వీటితో పాటు ఏపీలో ఉన్న దేవాలయాల ఆస్తులపై కూడా సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఆస్తులు అమ్మాలనుకున్న వారు ఆభరణాలను వదులుతారా? : తిరుమల వేంకటేశ్వరస్వామికి భక్తులు కానుకలు సమర్పిస్తారని, దస్తావేజులను సైతం హుండీలో వేస్తారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా టీటీడీకి ఇచ్చిన భవనాలున్నాయని చెప్పారు. గత పాలక మండలి తమిళనాడులోని 23 ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. వాటి విలువ రూ. 23.92 కోట్లుగా లెక్కగట్టిందని, నిరర్థక ఆస్తుల ద్వారా రూ. 100 కోట్లను సమకూర్చుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు.
గుంటూరులో ఒక భవనం, రంగారెడ్డి జిల్లాలో హయత్‌నగర్‌లో స్థలం, మల్కాజిగిరిలో భవనం, నాందేడ్, బెంగళూరుల్లో కొన్ని ఆస్తులను అమ్మకానికి సిద్ధం చేసిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నాడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీలు, పలు హిందూ ధార్మిక సంస్థలు బలంగా స్పందించడంతో ఈ విక్రయాన్ని ఆపేసిందని చెప్పారు. స్థిరాస్తులను అమ్మేయాలని చూసిన వారు, శ్రీవారి ఆభరణాల విషయంలోనూ ఏమైనా అవాంఛనీయ నిర్ణయాలు తీసుకున్నారా ? అన్నదాని దృష్టిపెట్టాలని సూచించారు.
శ్రీవాణి ట్రస్టు ఆదాయం ఎక్కడ ? : శ్రీవాణి ట్రస్టు ద్వారా భక్తుల నుంచి రూ.10,500 చొప్పున తీసుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బిల్లు మాత్రం రూ.500కే ఇచ్చారని తెలిపారు. ట్రస్టు ఏర్పాటు చేసినప్పుటి నుంచి వచ్చిన ఆదాయాన్ని ఎటు మళ్లించారో విచారణ చేయాలని చంద్రబాబును కోరినట్లు తెలిపారు.
అక్టోబర్ 1న తిరుమలకు పవన్‌కల్యాణ్ : అక్టోబర్ 1న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు తిరుమల వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన అక్టోబరు 1న తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళుతారు. 2న ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించనున్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం జరిగిన నేపథ్యంలో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.