AP CM Chandrababu On Polavaram Project Issues : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలి పర్యటన కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈరోజు (జూన్ 17వ తేదీ 2024) ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్‌వే సహా వివిధ ప్రాంతాలను వీక్షించారు.
ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు.
Chandrababu On Polvaram Project : ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించానని తెలిపారు. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయన్న చంద్రబాబు, జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశామని వెల్లడించారు.
నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని భావించామని చంద్రబాబు అన్నారు. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పిందని గుర్తు చేశారు. ఏజెన్సీని మారిస్తే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారని, అయినా ఏజెన్సీని మార్చారని తెలిపారు. ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదొక కేస్ స్టడీ అని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పేరుతో రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా జరిగిందని వాపోయారు. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగిందని, నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
‘‘రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారు. ఏజెన్సీతోపాటు సిబ్బందినీ మార్చారు. డయాఫ్రమ్ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు. ఈ ప్రాజెక్టుపై వందసార్లు సమీక్షించాను. 30 సార్లు సందర్శించాను. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు. అన్సీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు’’ అని చంద్రబాబు వెల్లడించారు.