Andhra Pradesh Assembly Session: కూటమి ప్రభుత్వం కొలువుదీరాక అసెంబ్లీ మొదటి సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ హోదాలో సభాపతి స్థానంలో ఆశీనులు కానున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించనున్నారు.
తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణం: ఉదయం 9 గంటల 46 నిమిషాలకు సభ ప్రారంభం కాగానే అసెంబ్లీ కార్యదర్శి ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సభాపతి స్థానానికి ఆహ్వానిస్తారు. సభాపతి స్థానంలో కుర్చున్న తరువాత తొలుత సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రమాణం చేయిస్తారు. ఆ తరువాత వరుసగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు!
గంటకు సగటున 25 మంది సభ్యుల ప్రమాణం చొప్పున 7 గంటల పాటు ఈ ప్రక్రియ సాగనుంది. తొలిరోజే దాదాపు సభ్యులందరి చేత ప్రమాణం చేయించే అవకాశం ఉంది. వివిధ కారణాల వల్ల ఎవరైనా తొలిరోజు సభకు రాలేకపోయినా, ప్రమాణం చేయలేకపోయినా వారితో శనివారం ఉదయం సభ తొలి సెషన్లో ప్రమాణం చేయిస్తారు.
స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు: సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక, స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. స్పీకర్ పదవికి నర్సీపట్నం ఎమ్మెల్యే, బీసీ సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేయనున్నారు. ఉపసభాపతి పదవికి రాయలసీమ నుంచి బోయ సామాజికవర్గానికి చెందిన కాలవ శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఛీఫ్ విప్‌గా మరో సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర వ్యవహరించనున్నారు!
సభకు స్వల్ప విరామం ఇచ్చి స్పీకర్‌గా ఎన్నికైన వారి పేరును ప్రొటెం స్పీకర్ ప్రకటిస్తారు. అన్ని పార్టీల నేతలు కలిసి నూతన స్పీకర్‌ను సభాపతి స్థానంలో కుర్చోబెడతారు. ఆ తరువాత స్పీకర్‌ను ఉద్దేశించి తొలుత సభా నాయకుడైన చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడతారు. వాటికి స్పీకర్ సమాధానం ఇచ్చాక సభ నిరవధిక వాయిదా పడనుంది!
విజిటింగ్ పాస్‌లు రద్దు: పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్ స్థానానికి కుడివైపు అధికార పక్షం, ఎడమ వైపు అత్యధిక స్థానాలు గెలిచిన రెండో పార్టీ సభ్యులు కుర్చోనున్నారు. ఈ సారి ప్రతిపక్ష స్థానం కూడా ఎవరికీ దక్కనివ్వకుండా కూటమి విజయధుందుభి మోగించడంతో వైఎస్సార్సీపీ స్థానం ఎక్కడనే ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా కుటుంబసభ్యలతో సహా ఎవరికీ విజిటింగ్ పాస్‌లు జారీ చేయడం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. స్థలాభావం కారణంగా విజిటింగ్ పాస్‌లు రద్దు చేసినట్లు వివరించారు.
ఈ నెల 21నుంచి అసెంబ్లీ సమావేశాలు- స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు - Assembly Session Starts From June21