Father Suicide with his Two Children : ఆనందంగా కలిసి మెలిసి ఉంటున్న అన్నదమ్ముల అనుబంధం మధ్య డబ్బు చిచ్చు రేపింది. ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వాలని అడిగిన అన్నపైనే తమ్ముడు దుర్భాషలాడి, దాడి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అన్న పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. సిద్దిపేటకు చెందిన తేలు సత్యం(49) తన కుమారుడు అన్విష్‌నందన్(8), కుమార్తె త్రివర్ణహాసిని(6)లతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు సిద్దిపేట టూటౌన్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన సత్యం, అతని సోదరుడు శ్రీనివాస్‌లు తల్లి లచ్చవ్వతో కలిసి సిద్దిపేటలోని వివేకానందనగర్ కాలనీలో స్థిరపడ్డారు.
రూ.లక్షన్నర అప్పు తెచ్చి పెళ్లి : సత్యం మొదటి భార్య స్వరూప పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో 2016లో పట్టణానికి చెందిన శిరీషను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అన్విష్‌నందన్, కుమార్తె త్రివర్ణహాసిని ఉన్నారు. అయితే సత్యం తన సోదరుడు శ్రీనివాస్‌కు రూ.లక్షన్నర అప్పు తెచ్చి పెళ్లి చేశాడు. అనంతరం అవసరం నిమిత్తం మరో రూ.4 లక్షలు ఇచ్చాడు. ఈక్రమంలో వీరిమధ్య గొడవలు రావడంతో శ్రీనివాస్ తన భార్య, తల్లితో కలిసి వేరుగా నివాసం ఉంటున్నాడు. అయితే సత్యం ఏడాది కిందట అనారోగ్యానికి గురయ్యారు. తన శస్త్రచికిత్సకు రూ.9.80 లక్షలు ఖర్చయ్యాయని, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేదని నెలరోజుల కిందట శ్రీనివాస్ ఇంటికి వెళ్లి గతంలో తాను ఇచ్చిన సొమ్ము మొత్తం రూ.5.50 లక్షలు ఇవ్వాలని అడిగారు.
సెల్ టవర్ ఎక్కిన యువకుడు - పోలీసుల హామీతో కిందకు
అన్నపై దుర్భాషలాడి దాడి : అయితే శ్రీనివాస్ తాను ఇవ్వనంటూ తెగేసి చెప్పి అన్నపై దుర్భాషలాడి దాడికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన సత్యం తన ఇద్దరు పిల్లలను తీసుకుని శనివారం సాయంత్రం పట్టణ శివారులో ఉన్న చింతల్ చెరువు వద్దకు ద్విచక్రవాహంపై వెళ్లారు. తమ ముగ్గురి చావుకు సోదరుడు శ్రీనివాసే కారణమంటూ సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్‌ను వాహనంలో పెట్టి తన పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీసి సిద్దిపేట సర్వజన ఆస్పత్రికి తరలించారు. సత్యం భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మధు, సీఐ ఉపేందర్ వెల్లడించారు.
కొన్ని రోజుల్లో కుమార్తె పెళ్లి - గోదావరిలోకి దూకిన కుటుంబం - ఏం జరిగిందంటే!
తల్లికి అనారోగ్యంతో పాటు మానసిక సమస్య - ఆమె కుమార్తె ఏం చేసిందంటే?