AP Man Married American Girl : ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఉండవంటారు. మనసులు కలిసిన మనుషులను ఏదీ విడదీయలేదంటారు. అది ఒక ఇంద్రజాలం. రెండు క్షణాలతో అంతమయ్యేది అంతకన్నా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ బంధమూలేని తొలి సంబంధమే ప్రేమ. అది ఒక అనిర్వచనీయ మధురానుభూతి. దానిని నిజంగా మనసుపెట్టి చూడగలిగితే, మనస్పూర్తిగా ఆస్వాదించగలిగితే ఆది అంతం లేని అమరానందమే.
అలాంటి అపురూపమైన ప్రేమకు దాసులు కానివారు ఎవరుంటారు. ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ దీనిని ఆస్వాదించే ఉంటారు. అలాంటి అనుభూతిలో తమను తాము మర్చిపోయి కాలం గడపిన వారు ఉన్నారు. ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకున్నపుడు ప్రేమే జీవరాగమవుతుంది. అదే జ్ఞానయోగమూ అవుతుంది. రెండు హృదయాల్లో సెలయేటిలా పారుతుంది. అలసట తీర్చే చిరుగాలిలా మారుతుంది. తాజాగా వారిది ఊరు కాని ఊరు. దేశం కాని దేశం. ఒకరి భాష మరొకరికి రాదు. అయినా వారి హృదయాలు కలిశాయి. ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించిన ఆ జంట ఇప్పుడు ఒక్కటయ్యారు. అమెరికా అమ్మాయితో ఆంధ్రా అబ్బాయి వివాహ విశేషాలేంటో తెలుసుకుందామా?
AP Guy Marries American Girl : ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన పగిడపల్లి ఆనంద్ గత 15 సంవత్సరాలుగా అమెరికాలోని నశ్విలేలో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ పలు వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. అక్కడ టీచర్‌గా పని చేస్తున్న అంబర్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన స్నేహం కాస్తా కొన్ని రోజులకు ప్రేమగా మారింది. ఒకరికొకరు తమ ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపాయి.
దీంతో నందిగామ శివారులోని ఓ కళాశాల ప్రాంగణంలో శనివారం రాత్రి వీరి వివాహం జరిగింది. దీనిని క్రైస్తవ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అమెరికా అమ్మాయి ఆంధ్ర అబ్బాయి వివాహ వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ వేడుకకు అమెరికా నుంచి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వారి బంధువులు కూడా హాజరయ్యారు. ప్రేమను గెలిపించుకొని బంధంతో ఒక్కటవ్వడంతో ఆ జంట ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
ఇక్కడ అమ్మాయి, అమెరికా అబ్బాయి - తిరుపతిలో ఏడడుగులు 'ఎలా కలిశారంటే!'