Amaravati Farmers Movement Reached 1500 Days: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి గ్రామాల్లో రైతులు చేపట్టిన ఉద్యమం 1500 రోజులకు చేరింది. ఈ సందర్భంగా రాజధాని ఐకాస ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వెలగపూడి శిబిరం వద్ద తెలుగు తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి అమరావతికి, రాష్ట్రానికి ఆశీస్సులు కోరారు. ఇటీవల మరణించిన దళిత ఐకాస నేత గడ్డం మార్టిన్ లూధర్కు నివాళులు అర్పించి వెలగపూడి, మందడం గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా, తెనాలి శ్రావణ్ కుమార్, శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ సభలో పాల్గొన్నారు.
అమరావతిపై జగన్ సర్కార్ మరో కుట్ర! - మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం
జగన్మోహన్ రెడ్డి చాలా ప్రమాదకరమని ఆయన్ని ఎదుర్కోవటంలో చివరి వరకూ ఏమరపాటు వద్దని శ్రావణ్ కుమార్ సూచించారు. జగన్ చేస్తున్న వేదాంతపూరిత వ్యాఖ్యలు ప్రజల్ని మోసం చేయటానికేనని అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి దేవినేని హెచ్ఛరించారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి గెలిచిన నాడే అమరావతి రైతులు నిజమైన విజయం సాధించినట్లు అవుతుందని వర్ల రామయ్య అన్నారు. మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టిన సమయంలో ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా తగ్గకుండా సెలక్ట్ కమిటికి పంపినట్లు మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక ప్రతిష్ఠ గంగపాలేనా? - అమరావతి బాండ్లకు వడ్డీల పెండింగ్
చంద్రబాబుతోనే అమరావతి పూర్తి: రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాననే విషయం ముఖ్యమంత్రి జగన్కు కూడా అర్ధమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని రైతుల పోరాటం ముగిసిందని, వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించడమే మిగిలిందని వ్యాఖ్యానించారు. ఓటమి తప్పదని గ్రహించిన జగన్ ఇంట్లో కూర్చుంటానంటూ నిర్వేదంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం సమర శంఖం పూరిస్తున్నట్లు అమరావతి ఐకాస నేతలు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకోవడం ద్వారానే అమరావతి నిలబడుతుందని రాజధాని మహిళా ఐకాస కన్వీనర్ రాయపాటి శైలజ అన్నారు. జగన్ జడ్జిలను కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారని టీడీపీ అధికారంలోకి వచ్చాక వీటిపై విచారణ జరపాలని హైకోర్టు న్యాయవాది లక్ష్మినారాయణ కోరారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని ఓడించేందుకు అంతా కలిసి పని చేయాలని తీర్మానించారు. తమ పోరాటాన్ని పట్టించుకోని జగన్కు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు తెలిపారు. మహిళా రైతులు మాట్లాడుతూ అమరావతికి భూమిలిచ్చిన రైతులను ఇబ్బందులు పెట్టిన జగన్ రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అమరావతికి పునాది రాయి వేసిన చంద్రబాబుని గెలిపించుకుంటేనే రాజధానిని పూర్తవుతుందని రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతిని ఆపేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసిన జగన్కు ప్రజలు బుద్ది చెప్పాలని రైతులు కోరారు. రాజధానిలోని ఇతర గ్రామాల్లోను 15వందల రోజుల ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతిని కాపాడుకుంటామని నినదించారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో వైఎస్సార్సీపీకి గడ్డు పరిస్థితులు