Amaravati Capital Farmers Welcome to CM Chandrababu in AP : ఐదేళ్ల పాటు జగన్ కక్షసాధింపు రాజకీయాలకు బలై పోరాటమే ఊపిరిగా సాగిన రాజధాని రైతులు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయడంతో 1631 రోజుల సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి పలికారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించి ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకాలు పెట్టేందుకు సచివాలయానికి వెళ్తున్న తరుణాన రాజధాని అమరావతి రైతులు చంద్రబాబుకు అఖండ స్వాగతం పలికారు. సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి చేరుకోగానే చంద్రబాబును రైతులు ఆత్మీయంగా ఆహ్వానించారు. అమరావతి నిర్మాతకు జేజేలు కొట్టారు. వాహనశ్రేణిపై పూలవర్షం కురిపించారు. కారు దిగి రైతుల వద్దకు వచ్చిన చంద్రబాబుకు క్రేన్ సాయంతో గజమాల వేశారు.
సీడ్ యాక్సిస్ రహదారి వెంట పూలబాట పరిచిన రైతులు, మహిళలు తమతో పాటు రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు పెద్దాయన వచ్చారు పెద్ద పండుగ వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు. 2019లో వైఎస్సాఆర్సీపీ నేతలు రాళ్లు విసిరిన ప్రదేశం నుంచే చంద్రబాబుపై ప్రస్తుతం పూలవర్షం కురిపించారు. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలుకుతూ ర్యాలీగా ఆయన వెంట తరలివెళ్లారు. ఓ మహిళ అయితే చంద్రబాబు కాన్వాయ్ వెంట సచివాలయం వరకూ పరుగు తీసింది. ఐదేళ్ల పాటు కేసులు, దాడులు, ఆంక్షలు ఇలా ఒక్కటేమిటి ఎన్నో కష్టాలు పడ్డామని రైతులు భావోద్వేగానికి లోనయ్యారు. వాటన్నింటింకి ఇక కాలం చెల్లినట్లేనని అన్నారు. ఇకపై అమరావతి కాదు రాష్ట్రమంతా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఉండవల్లి, వెంకటపాలెం, మందడం మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి చేరుకున్నారు. ప్రతీ గ్రామంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర వాహనంతో మందడం గ్రామం వద్ద పాదయాత్ర రైతులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ రైతుల సంబరాలు చేసుకున్నారు.
ఉద్యోగులు హర్షాతిరేకాలు : గత పాలకుడి తీరుతో విసిగి వేసారిపోయిన ఉద్యోగులు నవ్యాంధ్ర రథసారథి చంద్రబాబును సచివాలయం వద్ద ఆత్మీయంగా స్వాగతించారు. సీఎం చంద్రబాబుకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఐదేళ్ల పాటు పడిన కష్టాలు తొలగిపోతాయని ఉద్యోగులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు అందుతాయని, పీఆర్సీ సహా అన్నిరకాల లబ్ధి చేకూరేలా చంద్రబాబు చూస్తారని తమకు తగిన న్యాయం చేస్తారన్నారు. గత పాలనలో ఉన్న ఆంక్షలు, హక్కుల హననం ఇకపై ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఉద్యోగుల జీవితాలతోపాటు రాష్ట్రం దశ, దిశ మారుతుందని అన్నారు.