All Time Record For Turmeric in Nizamabad : పసుపును పచ్చ బంగారంగా పిలుస్తారు. అప్పట్లో నిజామాబాద్ రైతులు ఒక క్వింటా పసుపు అమ్మితే తులం బంగారం కొనేంత డబ్బు వచ్చేది. కాగా కాలక్రమంలో బంగారం ధరలు పెరిగాయి. కానీ, పసుపు ధరలు పెరగడం కాదు కదా, తగ్గుతూ వచ్చాయి. దీంతో పదేళ్లుగా సరైన ధరలు లేక రైతులు అవస్థలు పడ్డారు. అయితే మళ్లీ రైతుల పాలిట పసుపు బంగారంగా మారుతోంది. నాలుగేళ్లుగా కేంద్రం అనుసరించిన విధానాలు, కొవిడ్(Covid-19) తర్వాత పెరిగిన వినియోగంతో పసుపు పంటకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ధరలు ఆల్‌టైల్ రికార్డు నమోదు చేస్తున్నాయి. 2011లో 16 వేల పైచిలుకు పలికిన క్వింటాల్ పసుపు ధర, అనంతర కాలంలో 5 నుంచి 7 వేల కనిష్ఠానికి పడిపోయింది.
పసిడి సిరిగా మారిన పసుపు : కాగా అదే క్వింటాల్ పసుపు ధర సోమవారం నాడు ఏకంగా 18 వేలు రూపాయల పైచిలుకు పలికింది. ఇదే పసుపునకు మహారాష్ట్ర లోని సాంగ్లీ మార్కెట్‌లో ఏకంగా 19 వేల రూపాయల ధర వచ్చింది. దశాబ్ద కాలంగా రైతులకు నష్టాలు మిగిల్చిన పసుపు, నేడు తమ పాలిట పసిడిగా మారి సిరులు కురిపిస్తుండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పసుపు పంట పేరెత్తితే గుర్తొచ్చేది నిజామాబాద్ జిల్లా. ఎందుకంటే పసుపు సాగుతో పాటు ఆ పంటకు అతిపెద్ద మార్కెట్ ఉన్నది కూడా ఇక్కడే. అందుకే నిజామాబాద్ జిల్లా సహా పక్కనే ఉన్న నిర్మల్, జగిత్యాల(Jagtial) జిల్లా రైతులు సైతం ఇక్కడికే తమ పంటను తీసుకొచ్చి విక్రయిస్తారు.
నిజామాబాద్ జిల్లాలో 5 దశాబ్దాలుగా పసుపు పంట సాగు చేస్తున్నారు. పసుపు పంట కాలం 9 నుంచి 10 నెలలు కాగా సాగు వ్యయం సైతం సాధారణ పంటలతో పోలిస్తే అధికంగా ఉంటుంది. ఎకరా పంట విస్తీర్ణానికి దాదాపు 70 వేల నుంచి లక్షన్నర రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. విత్తనం వేసింది మొదలు ఎరువులు అందించడం, పంటను తవ్వి ఉడక బెట్టడం, ఆరబెట్టడం వరకు ప్రతిపనీ ఖర్చుతో కూడుకున్నదే. గతంలో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 40 వేల ఎకరాల వరకు పసుపు సాగయ్యేది.
Turmeric Price in Nizamabad : తెలంగాణలో మిగతా జిల్లాలను కలిపితే 60 వేల పైచిలుకు ఎకరాల్లో పంట సాగయ్యేది. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో పండే పసుపు పంటకు సైతం మంచి డిమాండ్ ఉండేది. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బాల్కొండ డివిజన్లో పసుపు సాగు అధికంగా ఉంటుంది. ఆర్మూర్, వేల్పూర్, నందిపేట్, డొంకేశ్వర్, ఆలూర్, మోరాత్డ్, మెండోరా, జక్రాన్‌పల్లి, ఏర్గట్ల, బాల్కొండ, ముప్కాల్, కమ్మర్‌పల్లి, భీంగల్, మాక్లూర్, ధర్పల్లి తదితర మండలాల్లో అధిక విస్తీర్ణంలో పసుపు సాగవుతుంది. 2010 మే నెలలో క్వింటా పసుపు పంటకు రికార్డు ధర 16 వేల 700 రూపాయలు పలికింది. ఆ తర్వాత పన్నెండేళ్లుగా ధర క్రమంగా తగ్గుతూ 5 వేల నుంచి 7 వేల రూపాయల మధ్యనే ధర లభించింది.
రైతులు కనిష్ఠంగా 4 వేల రూపాయలకు సైతం తమ పంటను అమ్ముకుని వెళ్లిపోయిన రోజులూ ఉన్నాయి. దీంతో రైతులకు పసుపు పంట తీసికట్టుగా మారింది. ప్రభుత్వాల పట్టింపులేని తనం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా పసుపు సాగు రైతులకు శరాఘాతమైంది. క్రమంగా ధరలు పడిపోవడం, పెట్టుబడి వ్యయం పెరుగుతుండటంతో రైతులకు సాగు భారమైంది. దీంతో ఏటా పంట సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. కానీ, పసుపు పంటనే నమ్ముకున్న కొందరు రైతులు సాగు భారమైనా ప్రభుత్వం సహకరించపోయినా, మద్దతు రాకున్నా పంటను వదిలి పెట్టలేదు. సంప్రదాయ పంటగా ప్రతి రైతూ ఎంతో కొంత సాగు చేస్తూనే వస్తున్నారు. కాగా పంట విస్తీర్ణం తగ్గినా ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచి మంచి ధరలే లభిస్తుండడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
Record Level Price For Turmeric in Nizamabad 2024 : ఈ సీజన్ ప్రారంభం నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన పసుపు ధరలు, వారం కింద నిజామాబాద్ మార్కెట్‌లో క్వింటాకు 18 వేల రూపాయల పైచిలుకు పలికింది. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో నిజామాబాద్‌తో పోలిస్తే 2 వేల రూపాయలు అదనంగా ధర లభిస్తోంది. ప్రస్తుత సీజన్‌లో నిజామాబాద్ జిల్లా రైతులకు గరిష్ఠంగా 18,299 రూపాయల ధర లభించింది. సగటు ధరలు సైతం 10 వేల రూపాయల పైచిలుకు ఉండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. గతేడాది 5 వేలుగా ఉన్న క్వింటా పసుపు సగటు ధర ఇప్పుడు 10 వేలు పలకడంతో రైతులు సంబరపడిపోతున్నారు. ప్రతి సీజన్‌లో నిజామాబాద్ మార్కెట్‌కు దాదాపు 8 నుంచి 12 లక్షల టన్నులు పసుపు వస్తుంది. అయితే గతేడాది నుంచి అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడి తగ్గింది.
20 వేల రూపాయలకు పెరిగే అవకాశం : దీంతో ఈ ఏడాది 6 లక్షల క్వింటాళ్ల పసుపు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. సాగు విస్తీర్ణం తగ్గినా అధిక ధరల రావడంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తోంది. సీజన్ ప్రారంభంలోనే 10 వేల రూపాయల పైచిలుకు పలికిన క్వింటాల్ పసుపు ధర క్రమంగా పెరుగుతూ దాదాపు 18 వేలకు చేరింది. రానున్న కాలంలోనూ ఇదే స్థాయిలో పెరిగితే క్వింటాల్ పసుపు ధర 20 వేల రూపాయలకు చేరే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్‌కు వచ్చే పసుపును రాశులుగా పోస్తారు. దాని మీద ఆ పంట బరువు, తదితర వివరాలు ఉంటాయి. మార్కెట్‌లో ఉండే కొనుగోలుదారులు పంటను పరిశీలించి ధరను నిర్ణయిస్తారు. ఇందులో నాణ్యతను బట్టి కొంత మందికి అధిక ధరలు, మరికొందరికి కనిష్ఠ ధరలు లభిస్తాయి.
సరాసరి ధరలు మాత్రం గత పదేళ్లుగా రూ.5 వేలకు అటు ఇటుగా ఉంటున్నాయి. అయితే ఈ ఏడాది సగటు ధర ఏకంగా 10 వేల పైచిలుకు ఉండటంతో ఎక్కువ మంది రైతులకు మంచి ధరలు లభించినట్లైంది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని నిజామాబాద్ మార్కెట్ యార్డు(Nizamabad Market Yard) సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. తెలంగాణలో వివిధ కారణాలతో పసుపు సాగు విస్తీర్ణం తగ్గినా దేశవ్యాప్తంగా గత అయిదేళ్లలో మాత్రం పెరిగింది. 2018-19లో 6 లక్షల 46 వేల 947 ఎకరాలు సాగైతే, 2022-23 లో 8 లక్షల 4 వేల 259 ఎకరాలకు పెరిగింది. అంటే అయిదేళ్లలో 1.57 లక్షల విస్తీర్ణం అదనంగా పెరిగింది.
అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ : దీనికి తోడు గత నాలుగేళ్లుగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, తీసుకున్న నిర్ణయాలు పసుపు పంటకు లభిస్తున్న ధరలో సానుకూల మార్పులకు కారణంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దిగుమతులను తగ్గిస్తూ ఎగుమతులను పెంచుతూ వచ్చింది. ఇది పంటకు ధర పెరగడానికి ప్రధాన కారణమైంది. 2018-19లో పసుపు ఎగుమతులు లక్షా 33 వేల 600 టన్నులు కాగా, 2022-23 నాటికి ఇది లక్షా 70 వేల 85 టన్నులకు చేరింది. 2018-19 లో 30,578 టన్నుల పసుపు దిగుమతి చేసుకోగా, 2022-23 నాటికి దిగుమతులను 16,769 టన్నులకు పరిమితం అయ్యాయి. దేశీయంగా ఎగుమతులు పెంచడం, అంతర్జాతీయంగా పసుపునకు డిమాండ్ ఉండటంతో ఆ ఫలితాలు ఈ ఏడాది ధర రూపంలో కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
వీటితో పాటు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్(One District one Product) కింద నిజామాబాద్ పసుపును ఎంపిక చేయడం, రాష్ట్రానికి పసుపు బోర్డు మంజూరు చేయడం, స్పైసెస్ బోర్డుతో ఏర్పాటు చేయడం లాంటి తదితర కారణాల వల్ల పసుపునకు మంచి ధర లభిస్తుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ చెబుతున్నారు. పదేళ్లుగా సరైన ధరలు లేక క్రమంగా సాగు తగ్గిస్తూ వచ్చిన రైతులు, ప్రస్తుత ధరలు రాబోయే రోజుల్లో పసుపు పంట విస్తీర్ణం పెంచేందుకు దోహదం చేస్తాయని అంటున్నారు. అయితే మిగతా పంటలకు ఉన్నట్టే పసుపు పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని కోరుతున్నారు. తద్వారా ఎప్పుడు ధర పడిపోతుందో అన్న ఆందోళన లేకుండా పసుపు సాగు చేస్తామని చెబుతున్నారు.
Turmeric Price Hike in Nizamabad : లేదంటే మార్కెట్‌కు అనుగుణంగా దళారులు ధరలు తగ్గించి కొని, ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికలకు(Parliament Elections) ముందు జిల్లాలో పసుపు పంటకు మద్ధతు ధర కోసం రైతులు అనేక విధాలుగా ఆందోళన చేశారు. చివరకు పార్లమెంట్ ఎన్నికల బరిలోనూ రైతులు పోటీ చేశారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆల్‌టైమ్ రికార్డ్ ధరలు నమోదు కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవే ధరలు స్థిరంగా ఉంటేనే రైతులకు మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
'గత కొన్ని సంవత్సరాలకు పసుపు ధర 16 వేలకు పైగా ఉండేది. చరిత్రను తిరగరాసి ప్రస్తుతం రూ.17 వేలకు పైగా వస్తోంది. ఇంకా రాబోయే రోజుల్లో పసుపు ధర పెరుగుతుంది.'-ధర్మపురి అరవింద్, నిజామాబాద్, ఎంపీ.
పసుపు పంటకు రికార్డు ధర - ఆనందంలో అన్నదాతలు
ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు రైతులకు నీటికష్టాలు - కాలువలో నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలు