Andhra Pradesh Air Quality Index : పీల్చే గాలే విషతుల్యమైతే ప్రాణికోటి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ప్రఖ్యాత వైద్యజర్నల్ ‘లాన్సెట్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి వంటి పది మహానగరాల్లో నిత్యం 7% అకాల మరణాలకు కలుషిత గాలే కారణం. ఇప్పటి వరకు వాయుకాలుష్యం అంటే మహానగరాలకే పరిమితం అనుకునేవారు. ఇప్పుడా పరిస్థితి చిన్న పట్టణాల్లోనూ మొదలైంది.
రాష్ట్రంలో వాయునాణ్యత అంతకంతకూ దిగజారుతోంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) గణాంకాల ప్రకారం గతేడాది సెప్టెంబరులో దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో (టాప్-10) విశాఖపట్నం ఆరు రోజులు, విజయవాడ మూడు రోజులు నిలిచాయి. రాష్ట్రంలోని 26 నగరాలు, పట్టణాలు 30 రోజుల వ్యవధిలో టాప్-67లో కనీసం ఐదుసార్లు ఉన్నాయి. జాతీయ వాయునాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో రాష్ట్రంలోని 13 నగరాలు విఫలమైనట్టు జాతీయ కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గుర్తించింది. వీటిలో విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి.
దేశీయంగా 2026 నాటికి 131 నగరాల్లో సూక్ష్మ ధూళికణాల సాంద్రతను 40% తగ్గించాలని కేంద్రం ఐదేళ్ల కిత్రం జాతీయ వాయుశుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ లక్ష్యసాధనలో పురోగతి లేకపోగా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పరిస్థితి మరింత దిగజారిందని కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది.
నాసిరకంగా వాయు నాణ్యత సూచీ : నిర్ణీత సమయంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఓజోన్ స్థితి, గాలిలోని ధూళిరేణువులు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ పరిమాణాన్ని బట్టి గాలి నాణ్యతను లెక్కిస్తారు. వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) 0-50 మధ్య ఉంటే గాలి స్వచ్ఛంగా ఉన్నట్లు, 51- 100 ఉంటే ఓ మోస్తరుగా, 101-200 మధ్య నాసిరకంగా, 201-300 ఉంటే అనారోగ్యకరంగా, 301-400 ఉంటే తీవ్రంగా, 401-500 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు లెక్కిస్తారు. రాష్ట్రంలో సగటు ఏక్యూఐ 110-140 మధ్యలో ఉంటుంది.
రోజుకు రెండు సిగరెట్లు కాల్చినంత దుష్ప్రభావం : ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో అతి సూక్ష్మ ధూళికణాల సాంద్రత (పీఎం2.5) 5 మైక్రోగ్రాములకు మించకూడదు. కానీ రాష్ట్రంలో అది సగటున 30-45 మైక్రోగ్రాముల మధ్య ఉంది. ఇదినిర్ణీత ప్రమాణం కంటే 6-9 రెట్లు అధికం. ఈ నాసిరకం గాలి పీల్చడం వల్ల రాష్ట్రంలోని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి మనిషిపై రోజుకు సగటున రెండు సిగరెట్లు కాలిస్తే పడే దుష్ప్రభావం పడుతోందని ఏక్యూఐ గణాంకాలు చెబుతున్నాయి. అలాగే సూక్ష్మ ధూళికణాల సాంద్రత (పీఎం10) 15 మైక్రోగ్రాములకు మించకూడదు. కానీ రాష్ట్రంలో ఇది నాలుగురెట్లు అధికంగా 78 మైక్రోగ్రాములుగా ఉంది.
రాష్ట్రంలో 1998లో పీఎం2.5 వార్షిక సగటు 17.8గా ఉండగా 2024కు అది 70-80 శాతానికి పెరిగింది. 2019-20లో విశాఖలో పీఎం2.5 వార్షిక సగటు 97 మైక్రోగ్రాములు ఉండగా 2023-24కు ఇది 120 మైక్రోగ్రాములకు చేరింది. విజయవాడలో ఇది 57 నుంచి 61 మైక్రోగ్రాములకు చేరింది. దీని వల్ల జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ప్రత్యక్షంగా వాయుకాలుష్యం బారినపడుతున్నారు. సాధారణ పౌరులతో పాటు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది హెచ్చరికేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Godavari River Turns into Pollution: కాలుష్య కాసారంగా గోదారమ్మ.. పట్టించుకోండి మహాప్రభూ..!