Asian Institute of Nephrology and Urology : నెలలు నిండక జన్మించిన శిశువులకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో కొందరికి ప్రాణాపాయం కూడా తలెత్తుతుంది. అలా, 32 వారాలకే పుట్టి, కేవలం 2 కిలోల బరువున్న ఓ శిశువుకు నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు రెండు శస్త్రచికిత్సలు చేసి, ప్రాణాలు కాపాడారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త భార్యకు నెలలు నిండకముందే శిశువు జన్మించాడు. ఆ శిశువుకు పోస్టీరియర్ యూరేత్రల్ వాల్వ్స్ (పీయూవీ) అనే అరుదైన సమస్య వచ్చింది. ఇది సాధారణంగా మగ పిల్లలకే ఉంటుంది. మూత్రాశయం నుంచి మూత్రప్రవాహం తగ్గిపోయేలా అదనపు కణజాలం మూత్రనాళాలను అడ్డుకుంటుంది. దానివల్ల మూత్రం లోపలే ఉండిపోయి, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు సాధారణంగా మూత్ర విసర్జన చేయడం కష్టం అవుతుంది.
శిశువు సమస్యను గుర్తించిన ఏఐఎన్‌యూ పీడియాట్రిక్ యూరాలజిస్టు డాక్టర్ ప్రభు కరుణాకరన్, ఒకేసారి సర్కమ్‌సిషన్, వాల్వ్ ఫల్గరేషన్ అనే రెండు శస్త్రచికిత్సలు చేసి శిశువు ప్రాణాలు కాపాడాడు. రెండు గంటలపాటు చేసిన ఈ శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది. అనంతరం శిశువును నియోనేటల్ ఐసీయూకు తరలించారు. శస్త్రచికిత్స విజయంవంతం కావడంపై డాక్టర్ ప్రభు కరుణాకరన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
అత్యంత చిన్న వయసున్న రోగులకు సైతం అత్యాధునిక వైద్యసేవలు అందించడంలో ఏఐఎన్‌యూకు ఉన్న నిబద్ధత, ఈ శస్త్రచికిత్సతో మరోసారి నిరూపితమైందని హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది. శిశువుల యూరాలజీ సంరక్షణ విషయంలో ఆస్పత్రికి ఉన్న నైపుణ్యం, రోగులకు చికిత్స, కీలక మద్దతు అందించే విధానాలు దీనివల్ల తెలుస్తాయని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ నిత్యానంద్ ఎనస్థీషియా బృందానికి నేతృత్వం వహించారు. ఇంకా పీడియాట్రిక్స్, ఎన్ఐసీయూ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ బృందాలు సహకరించాయి. తమ శిశువు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంపై తల్లిదండ్రులు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ బాబుకు పునర్జన్మను ఇచ్చిన ఎంతో రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.