AICC Announce Telangana PCC Chief : రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీలో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఏఐసీసీ ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం మహేశ్‌కుమార్ గౌడ్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ పీసీసీ పదవిని బీసీలకు ఇవ్వాలని నిర్ణయించిన అధిష్ఠానం, ఇందుకోసం మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్ పేర్లను పరిశీలించింది. వీరిరువురికి సంబంధించి పార్టీ కీలక నేతల నుంచి అభిప్రాయం తీసుకుంది. చివరకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఖరారు చేసింది.
Hon'ble Congress President has appointed Shri B. Mahesh Kumar Goud as the President of the Telangana Pradesh Congress Committee, with immediate effect. pic.twitter.com/sFi3FECmK3
— Telangana Congress (@INCTelangana) September 6, 2024
మహేశ్ కుమార్ గౌడ్ గడిచిన మూడేళ్లుగా పీసీసీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన యువజన కాంగ్రెస్ నుంచి పార్టీలో పని చేస్తున్నారు. దీంతో ఈయనకు ధిల్లీ స్థాయిలో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. పీసీసీ చీఫ్ పదవి కోసం జరిపిన పోటీలో మధుయాస్కీ, బలరాం నాయక్ నుంచి లాబీయింగ్ నడిచినా హైకమాండ్ మహేశ్ కుమార్ గౌడ్ వైపే మొగ్గింది.
తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్ఠానానికి మహేశ్‌కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను తాను చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. మహేష్‌కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులు కావడంతో గాంధీభవన్‌లో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేశారు.
పీసీసీ చీఫ్‌గా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతలో మహేష్ కుమార్ గౌడ్ గొప్పగా రాణించాలని పేర్కొన్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు. మూడేళ్ల క్రితం తనపై ఎంతో నమ్మకంతో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినాయకత్వానికి, సహకరించిన నాయకులకు, వీరోచితంగా పోరాడి, పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ నూతన పీసీసీ అధ్యక్షుడిగా నియామకం పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. వీరితో పాటు పలువురు మంత్రులు, పార్టీ నేతలు మహేష్ కుమార్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు.