Telangana State budget 2024 highlights : 2024 బడ్జెట్ అంచనాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయరంగానికి అత్యధికంగా రూ.72,659 కోట్లు కేటాయించారు. పశుసంవర్థకం విభాగానికి రూ.1,980 కోట్లు, ఉద్యానవనాలకు రూ.737 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.
రుణ మాఫీ : రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వం ఒకేసారిగా 31 వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించిందని భట్టి తెలిపారు.
రైతు బంధు పథకం : గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం క్రింద 80,440 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ది చేకూరేలా, రైతుబంధు పథకం స్థానంలో రైతు భరోసాను తీసుకువచ్చిందని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ధరణి సమస్యలపై కమిటీ అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా కృషి చూపిస్తామన్నారు.
రైతు కూలీలకు ఆర్థిక సాయం : భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పథకంలో చేరాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి, వాటిని పండించిన రైతుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
పశుసంవర్ధక రంగానికి : తెలంగాణలో 12.12 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటల సాగు ద్వారా 53.06 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని, 2024-25 లో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే 77,857 ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరగగా, 23,131 ఎకరాలకి అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందని ప్రకటించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కృత నిశ్చయంతో ఉందని, రైతులకు ఎలాంటి సమస్య రాకుండే ఉండేందుకు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఉద్యానవన శాఖకు బడ్జెట్లో 737 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్లు భట్టి తెలిపారు. పశుసంవర్ధక రంగానికి 1,980 కోట్ల రూపాయలు కేటాయించారు.