Agency People Crossing River in Bhadradri : వర్షాకాలం వచ్చిందంటే వారికి నరకయాతనే. చినుకు పడితే వారి గుండెల్లో గుభేలుమంటుంది. గత నాలుగురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు పొంగి పొర్లుతూ, ఉద్ధృతంగా ప్రవహిస్తూ, చెరువులు నుంచి అలుగులు పోస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆదివాసీలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగులు దాటుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో కుర్నపల్లి-రామచంద్రపురం మధ్యలో ఉన్న గుండ్ల వాగు వల్ల ఆ గ్రామ ప్రజలు, ఏడుమెలికల వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గుండాల గ్రామ ఆదివాసీలు నరకయాతన అనుభవిస్తున్నారు. పనుల నిమిత్తం, నిత్యావసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం దూరం వెళ్లి, లోతు నిర్థారించుకుని వాగును దాటారు. మంగళవారం కొంచెం వర్షం తగ్గడంతో రామచంద్రపురం ఆదివాసీలు వాగులోని భుజాల వరకు లోతు ఉన్న చోట నడిచి తినడానికి కూరగాయలు సామాగ్రిని తీసుకువెళ్లారు. తమకు కనీసం వంతెననైనా ఏర్పాటు చేయాలని ఆదివాసీలు ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. గతేడాది నెల రోజులుగా తమ గ్రామం జలదిగ్బంధంలో ఉందని, అయినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు.
మహిళలు సైతం వాగు దాటే సాహసాలు : గ్రామంలో గర్భిణీ మహిళలు సైతం ఉన్నారని ఆదివాసీలు తెలిపారు. వాగు అవతల భూములు ఉండటంతో కుర్నపల్లి గిరిజన రైతులు సైతం ఏటా వర్షాకాలంలో వాగును దాటేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఏదైనా వ్యాధులు సంభవిస్తే ఇక తమకు చావే శరణ్యమని ఆదివాసీలు వాపోతున్నారు. అత్యవసరమైన వేళ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సమయంలోనూ చెట్టుకొమ్మలు పట్టుకుని వాగు దాటుతున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకుని వాగుపై వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వర్షాకాలం ప్రారంభం ముందే ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, సీఐ, ఎస్సైలు ఏజెన్సీ గ్రామాల్లో ఎవరు ఉద్ధృతంగా ప్రవహించే వాగుల్లో ప్రయాణాలు చేయవద్దని, పశువులకాపరులు జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. లో లెవల్ వంతెన వద్ద పోలీసులు పహారా కాసినప్పటికీ, తప్పని పరిస్థితుల్లో వారికి దూరంగా వచ్చి మహిళలు సైతం వాగు దాటే సాహసాలు చేస్తున్నారు. పట్టు తప్పి కొట్టుకుపోయిన సందర్భాలు గతంలో ఉండడంతో ఒకరికొకరు తోడుగా వాగును దాటే ప్రయత్నాలు చేస్తున్నారు.
చెట్టెక్కితేనే ఆ గూడేనికి చేరిక - ఏళ్ల తరబడి గిరిజనుల సాహసం - Tribes Suffering With Floods
మా రోడ్డెక్కడో పోయింది? - వర్షాలతో కొట్టుకుపోయిన రహదారులు - RAIN DAMAGE ROADS IN BHUPALPALLY