Adulterated Milk Issues in Jagtial : పాలు అనేవి పసిబిడ్డ నుంచి పండు ముసలి దాకా అందరూ తాగే పౌష్ఠికాహారం. ఉదయం లేవగానే టీ లేదా కాఫీ మొదలుకొని బ్రేక్ ఫాస్ట్, లంచ్, రాత్రి డిన్నర్ ఇలా ప్రతి దానిలోనూ పాలు, పాల పదార్థాలను వాడుతూనే ఉంటాం. చిన్న పిల్లలకు ఆ పాలనే మరిగించి పడతూ ఉంటాం. ఏ తీపి వంటకం చేయాలన్నా, ఏ శుభకార్యమైనా పాలనే ప్రధానంగా వాడతాం. రోజూ పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులూ సూచిస్తారు. కానీ ఆ పాలే తాగి జగిత్యాలలోని ఓ కుటుంబం అనారోగ్యంతో మంచం పట్టింది.
కల్తీ పాలతో అనారోగ్యం : జగిత్యాల పట్టణంలోని సాయిరాం నగర్‌కు చెందిన లావణ్య అనే మహిళ ఓ పాలు పోసే వ్యక్తి వద్ద రోజూ పాలు తీసుకుంటుంది. రోజూ ఈ కుటుంబం అంతా అవే పాలు తాగుతున్నారు. ఆ పాలు తాగుతున్నప్పటి నుంచి ఆ కుటుంబం కొద్ది రోజులుగా విరేచనాలు, వాంతులతో బాధపడుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కల్తీ ఆహారం వల్ల ఇలా జరుగుతుందని, మంచి ఆహారం తీసుకోవాలని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు పాలను గమనించేందుకు 3 రోజుల పాటు వాటిని నిల్వ ఉంచారు.
పాల షాంపిళ్లను తీసకున్న ఫుడ్ సేప్టీ అధికారులు : 3 రోజుల పాటు నిల్వ ఉంచినా, ఆ పాలు విరిగిపోకుండా (పగలకుండా) ఉండటంతో నిర్వాహకున్ని నిలదీశారు. దీంతో అతను గొడవపడ్డాడు. చేసేది ఏమీ లేక బాధితులు అతడిని మున్సిపల్ అధికారులకు పట్టించారు. సమాచారం అందుకున్న ఫుడ్ సేప్టీ అధికారులు పాల కేంద్రంలోని పాలను తనిఖీ చేశారు. షాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు. దీనిపై విచారణ జరుపుతున్నాని, బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ అనూష తెలిపారు. ఇలా కల్తీ పాలతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు.
"సంవత్సరం నుంచి పాలు వాడుతున్నాం. పాలు తాగుతున్నప్పటి నుంచి విరేచనాలు, వాంతులు అవుతున్నాయి. పాలు వాసన రావడంతో అనుమానం వచ్చి మూడు రోజులు అలాగే ఉంచినా పాలు పగలకుండా ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి టెస్ట్ చేస్తే కల్తీ పాలని తేలింది. దీంతో ఆ పాల యజమానిని నిలదీస్తే గొడవకు దిగాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాం." -బాధితురాలు
చిక్కదనంతో పాటు తక్కువ ధర అని కొంటున్నారా? - ఆ బ్రాండ్ల పాలు కల్తీవట! - జర చూస్కోండి
అనారోగ్యాల బారిన పడేస్తున్న కల్తీ పా"పాలు" - ప్రజారోగ్యంపై తీవ్ర అనర్థాలు!