Adani Group Delegation Met Chandrababu : రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలతో అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, డేటా సెంటర్‌లు, కృత్రిమ మేధ, ఐటీ, గనులు, పోర్టులు, పర్యాటకం వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. స్వర్ణాంధ్ర సాధన, రాజధాని నిర్మాణంలో ఏపీ సర్కార్‌తో కలసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది.
అదానీ గ్రూప్ ఎండీ రాజేష్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్‌లు, సిమెంట్స్ విభాగం ఎండీ కరణ్ అదానీ సహా అదానీ గ్రూప్ నుంచి భారీ బృందం ఏపీకి తరలివచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమానమైన ఆ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లో తమ గ్రూప్ పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ని వివరించారు. ఏయే రంగాల్లో అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయో, వాటిలో తాము ఏ మేరకు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామో తెలియజేశారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరమో వారు వెల్లడించారు.
అదానీ గ్రూప్ చేసిన ప్రతిపాదనల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుల్ని అమలు చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అదానీ గ్రూప్ ప్రతినిధులతో సమావేశం వివరాల్ని ఎక్స్‌లో చంద్రబాబు పోస్ట్ చేశారు. అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ప్రాజెక్టులు సాకారమైతే ఏపీ ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని తెలిపారు. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ వంటి రంగాల్లో ఏపీ దూసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని చంద్రబాబు చెప్పారు.
అదానీ గ్రూప్ ముఖ్యమైన ప్రతిపాదనలు : రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టేందుకు అదానీ సంస్థ ముందుకొచ్చింది. ఇది వరకే సిద్ధం చేసిన ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌లో అవసరమైతే కొన్ని మార్పులు చేసి, ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయించిన డీపీఆర్‌కి తగ్గట్టే ఐఆర్‌ఆర్‌ని ఫేజ్-1, ఫేజ్-2లుగా ప్రతిపాదించింది. భవానీ ద్వీపం,రాజధాని సీడ్ యాక్సెస్‌రోడ్డు, కనకదుర్గ గుడి, బస్టాండ్, రైల్వేస్టేషన్లను కలుపుతూ రోప్‌వే నిర్మాణం చేపడతామంది. ట్రాఫిక్ స్టడీ తర్వాత అవసరమైతే అదనపు స్టేషన్లు నిర్మిస్తామని వెల్లడించింది.
ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టు అందుబాటులోకి అత్యుత్తమ రోప్‌వే తీసుకువచ్చి, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ - డీబీఎఫ్ఓటీ మోడల్‌లో ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. డీబీఎఫ్ఓటీ విధానంలో విశాఖలో సముద్రపు నీటి నుంచి రోజుకి 100 మిలియన్ లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేసే డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంది. అప్పికొండ బీచ్ దీనికి అనుకూలమని ఇందుకు రూ.800 కోట్ల మేర పెట్టుబడి పెడతామని వివరించింది. సముద్రపు నీటిని రివర్స్ ఆస్మోసిస్ విధానంలో శుద్ధి చేసే టెక్నాలజీని ఉపయోగించి మంచి నీటి ఉత్పత్తి ప్లాంట్ నిర్వహణకు గ్రీన్ ఎనర్జీని వినియోగిస్తామని తెలిపింది.
కృష్ణపట్నం, గంగవరం పోర్టుల విస్తరణ : కృష్ణపట్నం పోర్టు సామర్థ్యం 78 మిలియన్ టన్నుల నుంచి 330 మిలియన్ టన్నులకు, ఇప్పుడున్న 13 బెర్తుల సంఖ్యను 42కి పెంచుతామని అదానీ గ్రూప్ తెలిపింది. పోర్టు విస్తరణకు మరో 2189.86 ఎకరాలు అవసరమని 1033 ఎకరాల అటవీ భూమికి తొలిదశ అటవీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందని వివరించింది. 775 ఎకరాల ఉప్పు భూముల కోసం ఏపీ మారిటైం బోర్డుకి ప్రతిపాదన వెళ్లిందని డీపీఐఐటీతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించాలని కోరింది. దేవాదాయ భూములు 289.69 ఎకరాల సంబంధించి హైకోర్టులో వివాదాన్ని పరిష్కరించాల్సి ఉందని వెల్లడించింది.
గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్ టన్నుల నుంచి 200 మిలియన్ టన్నులకు పెంచుతామంది. 2022లో గంగవరం పోర్టు లిమిటెడ్ సేకరించిన భూముల్ని ఆపేరుతో ఉండేలా భూమి రికార్డులను మార్చాలని కోరింది. గతంలో కేటాయించిన 1800 ఎకరాల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న 217.57 ఎకరాలు తమకు అప్పగించాలని తెలిపింది. ఏపీఐఐసీ ద్వారా 5000ల ఎకరాల నుంచి 20,000ల ఎకరాలు కేటాయించి పారిశ్రామిక రాయితీలు కల్పిస్తే దేశంలోనే అతి పెద్ద పోర్టుల ఆధారిత పారిశ్రామికపార్కుల విస్తరణకు అవకాశం ఉందని స్పష్టంచేసింది.
బీచ్‌శాండ్, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టులు : బీచ్‌శాండ్, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టులకు సంబంధించి తొలిదశలో రూ.3000ల కోట్ల నుంచి రూ.4000ల కోట్ల పెట్టుబడి పెడతామని పేర్కొంది. దీనివల్ల ప్రత్యక్షంగా 2000ల మందికి, పరోక్షంగా 4000ల నుంచి 5000ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది. విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టుల్లో పెట్టుబడి రూ.15,000ల కోట్ల నుంచి రూ.20,000ల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించింది. తద్వారా ప్రత్యక్షంగా 4000ల మందికి, పరోక్షంగా 8000ల నుంచి 10,000ల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్పష్టంచేసింది.
ప్రభుత్వానికి ఆదాయం 30 ఏళ్లకు రూ.10,000ల కోట్ల ఆదాయం రానుందని వెల్లడించింది. టైటానియం డయాక్సైడ్ దిగుమతిని తగ్గించుకోవడం ద్వారా రూ.9000ల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కానుందని వివరించింది, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టు, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఆతిథ్యరంగం, మౌలిక వసతుల కల్పన, విద్యాకేంద్రాలు, వర్క్‌షాప్‌ల ఏర్పాటు చేస్తామని స్పష్టంచేసింది. ఇందుకు ప్రాధాన్యరంగంగా గుర్తించి ప్రత్యేక రాయితీలివ్వాలని కోరింది.
ప్రత్యేక రాయితీలివ్వాలి : ఈ మేరకు వందశాతం ఎస్‌జీఎస్టీ, వ్యాట్ రీఎంబర్స్‌మెంట్, పెద్ద పరిశ్రమగా గుర్తించి పదేళ్లపాటు కరెంట్ సుంకంపై 100 శాతం మినహాయింపు ఇవ్వాలని కోరింది. టైటానియం డయాక్సైడ్ ప్రాజెక్టుకు అధిక ఇంధన వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో అభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తులకు ఉన్న అవకాశాలకు అనుగుణంగా విద్యుత్ రాయితీ ఇవ్వాలంది. ప్రాజెక్టును పదేళ్లు విజయవంతంగా అమలు చేశాక భూమి కొనుగోలు ఎంపిక అవకాశం, స్థిర మూలధన పెట్టుబడి-ఎఫ్‌సీఐ రాయితీ, టెర్మ్‌రుణాలపై పదేళ్లపాటు వడ్డీ రాయితీ, పెట్టుబడి వ్యవధికి వందశాతం స్టాంపు రుసుము మినహాయింపు ఇవ్వాలంది. ఇళ్లకు ఉచితంగా నీరు, విద్యుత్తు సరఫరా ఏర్పాట్లు, దిగుమతి చేసుకునే పరికరాలపై కస్టమ్ సుంకం రద్దు, రీఎంబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరింది.
డిజిటల్, పునరుత్పాదక రంగాలు సంయుక్తంగా పనిచేయటం వల్ల రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో 17 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తమ ప్రణాళికలో వెల్లడించింది. ప్రధానంగా డేటా సెంటర్‌లు, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఫిల్మ్ మేకింగ్, పునరుత్పాదక విభాగాల్లో ఈ అవకాశాలున్నాయని వివరించింది.ప్రఖ్యాత గూగుల్ సంస్థ తన డేటా సెంటర్ల విస్తరణకు భారత్‌లో అనువైన ప్రాంతాల కోసం అన్వేషిస్తోందని వివరించింది. వారు నిర్దేశించుకున్న ప్రాతిపదికలకు విశాఖపట్నం సరిగ్గా సరిపోతుందని అయితే కాపీరైట్ చట్టాలు, పన్నుల చట్టాలు, చట్టబద్ధమైన యాక్సిస్‌కు సంబంధించి ఆ సంస్థ పలు సవరణలు కోరుతోందని తెలిపింది.
Adani Group Investments in AP : ఆంధ్రప్రదేశ్‌లో మూడు హైపర్‌స్కేలర్స్‌కు డేటా సెంటర్లు, వివిధ దేశాలకు డేటా ఎంబసీల నిర్మాణానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. హైపర్‌స్కేలర్స్‌ను ఆకర్షించేందుకు గిగావాట్‌ల గ్రీన్ ఎనర్జీ ఉండాలంది. సముద్ర గర్భంలో కేబుల్ కనెక్టవిటీ, టాలెంట్ బ్యాంకు అవసరమని తెలిపింది. ఏటా పెరిగే విద్యుత్ అవసరాలకు అనుగుణంగా 2032 నాటికి 9013 మెగావాట్లు అదనంగా అవసరం ఉంటుందని తెలిపింది.
ఆ విద్యుత్‌ను భర్తీ చేసేందుకు 4000ల మెగావాట్ల సౌర, 4000ల మెగావాట్ల పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రపంచ ప్రఖ్యాత ఏఐ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలనేది తమ ఉద్దేశమన్న అదానీ సంస్థ పేర్కొంది. దీనికి అనుబంధంగా ఏటా 50,000ల మంది విద్యార్థులకు శిక్షణిచ్చేలా సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్, ఏఐ ఫిల్మ్ మేకింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో యూనివర్శిటీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీనికి అనువైన పాలసీలను ప్రభుత్వం తీసుకురావాలని కోరింది. పరిశోధన,అభివృద్ధికి తోడ్పడేలా ఈ విధానాలు ఉండాలని టాప్ టాలెంట్‌ను ఆకర్షించేలా వారికి స్కాలర్‌షిప్‌లు, ఇన్సింటివ్స్ ప్రకటించాలని తమ ప్రతిపాదనల్లో అదానీ సంస్థ స్పష్టం చేసింది.
"పెట్టుబడులు, ప్రోత్సాహకాలు" - రాష్ట్రం రూపురేఖలు మార్చనున్న "ఆరు పాలసీలు"
గుడ్ న్యూస్ - త్వరలో విశాఖకు ఏవియేషన్ వర్సిటీ, డాటా సెంటర్!