ACB Raids on Hostels Across Telangana : రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంగళవారం వివిధ చోట్ల హాస్టల్లో వేర్వేరుగా సోదాలు చేపట్టిన అధికారులు విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో తనిఖీలు చేయగా అక్కడి దుస్థితి బయటపడింది. ఏసీబీతో సహా ఆహార భద్రత, శానిటరీ, ఆడిట్ అధికారులు వసతి గృహంలో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు అందించే ఆహారం అపరిశుభ్ర వాతావరణంలో వండుతున్నారని, వంట సరుకులు సైతం వండే పరిస్థితిల్లో లేవవి నాసిరకంగా ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వెల్లడించారు.
మెనూ ప్రకారం భోజనం వండటం లేదని, విద్యార్ధులకు అందాల్సిన స్వీట్లు, అరటి పండు, కోడి గుడ్లు కూడా అందించడంలేదని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. హాస్టల్ పరిసర ప్రాంతమంతా శుభ్రంగా లేదని, మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా చాలారోజులుగా శుభ్రపరచుకుండా ఉంచినట్లు వివరించారు. రిజిస్టర్లో 120 మంది విద్యార్ధులు ఉన్నట్లుగా నమోదు చేసినా వాస్తవంగా అక్కడ 80 మంది విద్యార్ధులు మాత్రమే ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఉదయం 6 గంటల తర్వాత తనిఖీలు జరిగిన సమయంలో వార్డెన్ కూడా అందుబాటులో లేరని, ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ శాఖ అధికారులను పిలిపించి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
'హాస్టల్లో వంటకు సంబంధించిన పదార్థాలు నాసిరకంగా ఉన్నాయి. మిగతా పదార్థాలు కూడా వండే పరిస్థితిలో లేవు. కనీస సౌకర్యాలు కూడా లేవు. బాత్రూంలకు తలుపులు కూడా సరిగా లేవు. బాత్రూంలు కూడా చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. ఫుడ్ మెనూ పాటించడం లేదు'- కృష్ణగౌడ్, ఏసీబీ డీఎస్పీ
బాత్రూంలకు తలుపులు కూడా సరిగా లేవు : మరోవైపు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్ ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలలో ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఈ గురుకులాల్లో 680 విద్యార్థులు ఉండగా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఏసీబీ డీఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల విద్యుత్ తీగల ప్రమాదకరంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదుల బాత్రూంలకు తలుపులు కూడా సరిగా లేవని అసహనం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ప్రభుత్వ వసతి గృహాల్లోనూ ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచి ఏకకాలంగా సోదాలు నిర్వహించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలతో పాటు వసతి గృహాలలో మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. తనిఖీల్లో దాదాపు ప్రతి హాస్టల్‌లోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలు వినియోగిస్తునట్లు అధికారులు గుర్తించారు. వసతిగృహాల్లోని బాత్రూంలు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని, ఫుడ్‌మెనూ పాటించడం లేదని వెల్లడించారు.