A Young Girl Mesmerizing with her Flute at Satya Sai District : కళాకారుల కుటుంబంలో జన్మించిన ఆ యువతి తండ్రి, తాతల నుంచి సంప్రదాయంగా వచ్చిన వేణునాదాన్ని అందిపుచ్చుకుంది. చిన్నతనం నుంచే తండ్రి వెంట కచేరీలకు వెళుతూ తల్లిచేసే నృత్యంతో పాటు తండ్రి వేణునాదాన్ని ఆలకించేది. తన కుమార్తెలో ఉత్సాహాన్ని గుర్తించిన ఆ యువతి తండ్రి మూడు తరాలుగా కచేరీల్లో వాడుతున్న వేణువులపై శిక్షణ ఇవ్వాలని భావించారు. వివిధ వేణువులతో ఏ విధంగా శబ్ధం వస్తుంది, ఏ వేణువును ఏ సందర్భంలో వినియోగించాలనే విషయాలపై శిక్షణ ఇచ్చారు.
ఈ లోపు 2020లో కరోనా లాక్డౌన్ రావడంతో కళాశాలలకు సెలవు రావడం, కుటుంబం అంతా ఇంట్లోనే ఉండటంతో వేణునాదంలో తన కుమార్తెను తీర్చిదిద్దారు. తండ్రి గురువుగా శిక్షణతో నేర్చుకున్న వేణునాదంతో స్థానికంగా ఆలయాల్లో పర్వదానాల్లో కచేరీలు ఇవ్వడం ప్రారంభించింది. ఓ వైపు ఇంటర్ చదువుతూనే మరోవైపు వేణునాదం కచేరీలు చేస్తూ, యూత్ ఫెస్టివల్ పోటీల్లో పాల్గొంటూ ఆ యువతి ఔరా అనిపిస్తోంది. ఈ పోటీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి స్థానం సాధించిన ఆ యువతి, దిల్లీలో నిర్వహించిన వేణు నాదం జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచి ప్రశంసలు అందుకుంది. అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన నాగాంజలి వేణునాదంతో జాతీయ స్థాయిలో రాణిస్తున్న వైనంపై యువ కథనం.
ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం- సదుపాయాలు లేకున్నా సాఫ్ట్‌బాల్‌లో సత్తా - SRIKAKULAM YOUTH IN SOFTBALL
శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిరకు చెందిన నాగభూషణం కుటుంబం మూడు తరాలుగా కళాకారులుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో పండగ పర్వదినాల్లో, ప్రత్యేక రోజుల్లో హరికథలు, మంగళవాయిద్యాలతో కచేరీలు ఇవ్వడం అనాదిగా వస్తోంది. ఆ కుటుంబంలో జన్మించిన నాగాంజలి, తన తండ్రి, తాతలతో పాటు దూర ప్రాంతాల్లో నిర్వహించే కచేరీలకు వెళ్లేది. ఈ విధంగా సంగీత వాయిద్యాలపై అవగాహన పెంచుకుంది. నాగాంజలి తాత, తబలా, వేణునాదంలతో ఆరితేరిన వ్యక్తిగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేరుంది.
తాత వద్ద శిక్షణ తీసుకున్న తండ్రి నాగభూషణం, కూడా తమ తాత, ముత్తాతల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని వదలకుండా కొనసాగించారు. నాగాంజలి తల్లి సుధ కూడా కళాకారుల కుటుంబం నుంచి రావడంతో, ఆమె నృత్యకళాకారిణిగా రాణించారు. తమ కుమార్తె వేణునాదం, నృత్యం పట్ల ఆసక్తి చూపుతోందని గుర్తించిన నాగభూషణం దంపతులు, తమ విద్యను కుమార్తె నాగాంజలికి ధారపోయాలని నిర్ణయించుకున్నారు. దీంతో నాగాంజలికి తల్లిదండ్రులు గురువులుగా మారి నృత్యం, వేణునాదంపై శిక్షణ ఇచ్చారు.
నాగాంజలి చిన్ననాటి నుంచి వేణువులను చేతపట్టుకొని ఆడుకుంటున్న తీరును గమనించిన తండ్రి నాగభూషణం, ఆమెకు వేణునాదంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇంటర్ చదువుతుండగానే 2020లో కరోనా వైరస్ విజృంభించడంతో లాక్డౌన్ విధించారు. కుటుంబం అంతా ఇంటి వద్దనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇదే అవకాశంగా తీసుకున్న నాగాంజలి తలిదండ్రులు తమ ఇద్దరి కుమార్తెలకు నృత్యంతోపాటు, చిన్న కుమార్తె అయిన నాగాంజలికి వేణునాదం నేర్పించారు. సుమారు రెండు నెలలకు పైగా వేణునాదంపై తండ్రి వద్ద శిక్షణ తీసుకున్న నాగాంజలి, లాక్డౌన్ అనంతరం అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో పర్వదినాల సందర్భంగా వేణునాదం కచేరీలు ఇచ్చారు.
ఇంటర్ విద్య అభ్యసిస్తూనే చదువులో ఎక్కడ వెనుకబాటు లేకుండా, తండ్రి వద్ద వేణునాదం నేర్చుకున్నారు. దేశవ్యాప్తంగా వేణునాదం కళాకారులు 18 మంది యువత పోటీలో పాల్గొనగా తొలి మూడు స్థానాలు దక్కకపోయినా, నాగాంజలి నిపుణుల ప్రశంసలందుకున్నారు. కేవలం ఆద్యాత్మిక కీర్తనలే కాకుండా, సినిమా పాటలను సైతం వేణునాదం చేసేలా ఆమె తండ్రి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చారు. తమ వంశపారంపర్యంగా వస్తున్న సంగీత వాయిద్యాలతో కచేరీ నిర్వహించడం, తమ ద్వితీయ కుమార్తెకు వేణునాదం విద్య అబ్బిందని తలిదండ్రులు చెబుతున్నారు.
"నా మెుదటి గురువు మా నాన్ననే. నాన్న వేణువు, తబలా, ఢోలక్ తదితర వాయిద్యాల్లో విద్వాంసుడు. తాత, ముత్తాతల వారసత్వం అందుకుని కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్నతనం నుంచే నాన్న వెంట ఆలయాల్లో జరిగే కచేరీలు, హరికథలకు ఉత్సాహంగా వెళ్లేదాన్ని. అది గమనించిన నాన్న మూడు తరాలుగా కచేరీల్లో వినిపించే వేణువులపై శిక్షణ ఇవ్వాలని భావించాడు. సాధారణంగా పియానో, కీబోర్డ్, గిటార్, డప్పులాంటి వాయిద్యాలపైనే నేటితరం మక్కువ చూపిస్తుంటారు. వేణునాదాన్ని ఎంచుకునే వాళ్లు చాలా అరుదు. తండ్రి, తాతల నుంచి సంప్రదాయంగా వచ్చిన కళ కావడంతో స్వతహాగానే ఆసక్తి పెరిగింది. అందుకే చెప్పిన వెంటనే అలవోకగా నేర్చుకునే దాన్ని. నృత్యం, సంగీతంలో నైపుణ్యం సాధించేందుకు లాక్‌డౌన్ సమయం చక్కగా ఉపయోగ పడింది." - నాగాంజలి, వేణునాదం కళాకారిణి
"వంశపారంపర్యంగా వస్తున్న కళ తమతోనే ముగిసిపోతుందని అనుకున్నాం. కానీ నా కుమార్తెకు నేర్పించాక ఆ బెంగ తీరింది. దేశవ్యాప్తంగా 18మంది కళాకారులతో పోటీపడి తన ప్రతిభతో సంగీతప్రియులు, విద్వాంసులను మెప్పించిందీ. చెప్పిన వెంటనే అలవోకగా నేర్చుకుంటుంది. విజయవాడలో జరిగిన రాష్ట్ర యువజనోత్సవాల్లోనూ విజేతగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. వారసత్వంగా వచ్చిన దాససాహిత్యం, ఆధ్యాత్మిక కీర్తనలతో పాటు సినిమా పాటలనూ వేణువుపై వీనులవిందుగా పలికిస్తోంది." - నాగభూషణం, నాగాంజలి తండ్రి
ప్రస్తుతం తిరుపతిలో నీట్ కోచింగ్ తీసుకుంటోంది నాగాంజలి. భవిష్యత్తులో డాక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తూనే సంప్రదాయ కళలకోసం కృషి చేయాలని ఆకాంక్షిస్తోంది. వేణునాదంలో ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్న నాగాంజలికి ఆల్ ద బెస్ట్ చెబుదామ మరీ.