Fake Bail In Chanchalguda Jail : నిందితులు తప్పు చేసి జైళ్లకి వెళ్తుంటారు. జైళ్లో శిక్షలు అనుభవించే నిందితులకు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. వారు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి దారులూ ఉండవు. నిత్యం సీసీ ఫుటేజీలతో గట్టి నిఘా ఉంటుంది. అయితే చంచల్‌గూడ జైలులోని ఓ ఖైదీ మాత్రం తెలివిగా తప్పించుకున్నాడు. నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి, పోలీస్ అధికారులను నమ్మించి విడుదలైన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
డబీర్‌పురా ఠాణా సీఐ నానునాయక్ కథనం ప్రకారం : సంతోశ్నగర్కు చెందిన సుజాత్ అలీ ఖాన్ (27)పై నవంబర్ 2న నార్సింగి పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది. అదే రోజు అతడిని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతరం అతడిపై మరో కేసు కూడా పెట్టారు. మొదటి కేసులో రాజేంద్రనగర్ కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు వచ్చినట్లు జైలు అధికారులకు ఇచ్చారు. మరో కేసు ఉండటంతో అతడిని విడుదల చేయలేదు. నవంబర్ 26న రెండో కేసులోనూ బెయిల్ మంజూరు కావడంతో అతడిని విడుదల చేశారు. అయితే ఆన్‌లైన్‌లో రావాల్సిన బెయిల్ ఉత్తర్వులు జైలుకు చేరలేదు. వారంట్లు తనిఖీ చేయగా, రెండో బెయిల్ ఉత్తర్వులు నకిలీవని తేలింది.
నకిలీ బెయిల్ ఉత్తర్వులు : ఇది ఆ జైలులోని మరో నిందితుడి సహాయంతో జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జైళ్ల శాఖ నిబంధనల ప్రకారం విచారణ ఖైదీలకు ఎలాంటి బాధ్యతలను ఇవ్వకూడదు. జైళ్ల కర్మాగారాల్లోనూ ఎలాంటి పనులు చేయించరు. కానీ చంచల్‌గూడలో ఆ నిబంధనలను తుంగలో తొక్కినట్లు తెలుస్తోంది. ఓ విచారణ ఖైదీకి కీలకమైన బెయిల్ విభాగంలో బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. అతడి సహకారంతోనే సుజాత్ అలీ ఖాన్ బయటపడినట్లు తెలుస్తోంది. డబీర్‌పురా పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
డ్రగ్స్ కేసుల నిందితులతో - చంచల్‌గూడ జైలు హౌజ్‌ఫుల్ - CHANCHALGUDA JAIL OVER CROWDED
Body worn cameras in chanchalguda: జైళ్లశాఖ సరికొత్త ప్రయోగం.. ఖైదీల కదలికలపై కెమెరాలతో నిఘా