Blast in South Glass Factory in Shadnagar : గ్యాస్ కంప్రెషర్ పేలి ఆరుగురు దుర్మరణం చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో అయిదుగురు మృతిచెందగా, 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ (25), రాంప్రకాశ్ (45), రథికాంత్ (25), అయోధ్య బస్తీ ప్రాంతానికి చెందిన నికేత్ (22), రాంసేత్ (22)గా గుర్తించారు.
కంప్రెషర్ పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడుతో పరిశ్రమలో భీతావహ వాతావరణం నెలకొంది. తీవ్రంగా గాయపడిన ఒకరికి శంషాబాద్ నిమ్స్‌లో, మిగతా 9 మందికి షాద్‌నగర్ వైవా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, శంషాబాద్ డీసీపీ రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కంప్రెషర్ సేఫ్టీ వాల్ పనిచేయకపోవడం వల్ల పేలుడు జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రమాదంలో ఐదుగురు చనిపోయనట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఆయన తెలిపారు.
"సౌత్ గ్లాస్ కంపెనీలో జరిగిన గ్యాస్ కంప్రెషర్ బ్లాస్ట్‌లో అయిదుగురు మరణించారు. గాయపడిన వారికి చికిత్స జరుగుతోంది. ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నాం. కంపెనీకి చెందిన ఇద్దరు యాజమానులను అందుబాటులోకి తీసుకున్నాము. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము". - రాజేశ్, శంషాబాద్ డీసీపీ
స్పందించిన ముఖ్యమంత్రి.. మరోవైపు షాద్‌నగర్ దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమల శాఖలు, వైద్య బృందాలు ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
కేసీఆర్ సంతాపం.. షాద్‌నగర్ ప్రమాదంపై మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు, కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రాష్ట్రప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతాల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, విపత్తు నిర్వహణ ప్రణాళికలు సమీక్షించాలని పేర్కొన్నారు.
Shocked to learn about the death of 6 workers in the horrific accident at south glass pvt limited at Shadnagar
— KTR (@KTRBRS) June 28, 2024
My heartfelt condolences to the families of the deceased and prayers for the swift recovery of those injured
Appeal to Telangana Government to immediately conduct a…
సౌత్ గ్లాస్ పరిశ్రమలో గ్యాస్ కంప్రెషర్ పేలుడు ఘటనపై రంగారెడ్డి జిల్లా కార్మిక సంఘాల నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. సంబంధింత కంపెనీ యాజమాన్యం బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లాలో రహదారులు రక్తసిక్తం - వేర్వేరు ఘటనల్లో ఆరుగురి దుర్మరణం - Medak Road Accident Today