Inhuman Incident in Suryapet District : మానవ సంబంధాలన్నీ నేడు మనీ సంబంధాలుగా మారిపోయాయి. అలా డబ్బే ముఖ్యం అనుకుంటూ కన్నవాళ్లను కూడా పట్టించుకోని ప్రబుద్ధులెందరో ఉన్నారు. తాజాగా నవమాసాలు మోసి, పురిటి నొప్పులను భరించి తమను కని, పెంచిన ఆ తల్లి రుణాన్ని ఆ పిల్లలు తీర్చుకోకపోగా, శవం వద్దే ఆస్తి పంపకాల కోసం గొడవకు దిగారు. తల్లికి తలకొరివి పెట్టాల్సిన కుమారుడు డబ్బులు ఇస్తేనే దహన సంస్కారాలు చేస్తానని పట్టుబట్టాడు. మరోవైపు కుమార్తెలు తమకేమీ పట్టనట్టుగా వెళ్లిపోయారు. అందరూ ఉన్న ఆమె, ఇప్పుడు అనాథ శవంలా మారింది. ఈ అమానుష ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
A Family Members Obstructed Mother Funeral : నేరేడుచర్ల మండలం కందులవారిగూడేనికి చెందిన వేం వెంకటరెడ్డి, లక్ష్మమ్మ (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. చిన్న కుమారుడు గతంలోనే చనిపోయాడు. భర్త వెంకటరెడ్డి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఐదేళ్లుగా లక్ష్మమ్మ నేరేడుచర్లలోని చిన్న కుమార్తె వద్దే ఉంటుంది. ఇటీవల ఆమె ఇంట్లో కాలుజారి కిందపడింది. దీంతో లక్ష్మమ్మను మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని, ఆక్సిజన్‌పైనే బతుకుతుందని చెప్పారు.
దీంతో బుధవారం నాడు అంబులెన్స్‌లో లక్ష్మమ్మను ఆక్సిజన్‌తోనే చిన్న కుమార్తె తమ ఇంటికి తీసుకెళ్లింది. ఈలోగా ఆమె కుమారుడు అక్కడికి చేరుకుని, పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించాడు. తల్లిని తన ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. దీనికి మిగతా కూమార్తెలు ఆస్తి పంపకాలు తేలేవరకూ అమ్మను తీసుకెళ్లనీయమని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే రాత్రి 11:00 గంటల సమయంలో లక్ష్మమ్మ కన్నుమూశారు.
బీమా కథా చిత్రమ్.. డబ్బు కోసం తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి మరీ చంపేశాడు
కుమారుడు లక్ష్మమ్మ మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించారు. అయినా వారి మధ్య పంచాయితీ మాత్రం తీరలేదు. లక్ష్మమ్మ దగ్గర రూ.21 లక్షలు, ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలున్నాయి. తల్లి వైద్య ఖర్చులు భరించిన చిన్న కుమార్తెకు అందులోంచి రూ.6 లక్షలు ఇచ్చారు. మిగతా రూ.15 లక్షలు కుమారుడు తీసుకున్నాడు. 20 తులాల బంగారు ఆభరణాలను ముగ్గురు కుమార్తెలు పంచుకున్నారు.
కొత్త పేచీ పెట్టిన కుమారుడు : అంతా సవ్యంగా సాగిందనుకున్న తరుణంలో కుమారుడు మరో కొత్త పేచీ పెట్టాడు. తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని భీష్మించుకుని కూర్చున్నాడు. ప్రస్తుతం లక్ష్మమ్మ మృతదేహం ఫ్రీజర్‌లో ఉంది. ఈ గొడవ ఎప్పుడు తీరుతుందోనని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిడ్డలున్నా అనాథగా తల్లి మృతదేహాన్ని వదిలేయడం వారి హృదయాల్ని కలచివేసింది. చివరకి పెద్దమనుషులు సర్దిచెప్పడంతో కుమారుడు అంత్యక్రియలు చేసేందుకు ఒప్పుకున్నాడు.
ఎంత పని చేశావే రూపాయి - కొడుకు మోసం ఆత్మహత్య చేసుకున్న తండ్రి - Man Suicide in Attapur