Parents Killed Daughter in Rajanna Sircilla District : పిల్లలను అమ్మనాన్నలు అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా తల్లడిల్లిపోతారు. వారే లోకంగా బతుకుతారు. కానీ తాజాగా ఓ తల్లిదండ్రులు చేసిన పని తేలిస్తే షాక్ కాక తప్పదు. కుమార్తె మానసిక పరిస్థితి సరిగా లేదని వారే ఆమెను కడతేర్చారు. ఏమీ తెలియదన్నట్లు దహన సంస్కారాలు నిర్వహించారు. చివరికిి గ్రామస్థులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు నిజం బయటపడి, నిందితులు కటకటాల పాలయ్యారు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరగాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
A Couple Arrested Killed Daughter : అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నలే సొంత కుమార్తెను హతమార్చారు. మరోవైపు మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందిన ఆ తల్లిదండ్రులు ఆమెకు పుట్టిన 13 నెలల కుమారుడిని తల్లి నుంచి దూరం చేశారు. ఇందుకు సంబంధించి ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం, తంగళ్లపల్లి మండలం నేరెల్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య-ఎల్లవ్వ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక(25). ఆమె గత ఏడు సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది.
సినిమాను తలపించేలా హత్య - భర్తను చంపించిన భార్య - Wife Killed Husband In Nalgonda
ప్రియాంకను ఆసుపత్రులు, దేవాలయాల వద్దకు తీసుకెళ్తూ చాలా నగదు ఖర్చు చేశారు. కొంతవరకు వ్యాధి నయం కావడంతో 2020లో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని దర్గాపల్లికి చెందిన పృథ్వీతో వివాహాం చేశారు. వారు కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో ఉంటున్నారు. వీరికి 13 నెలల కుమారుడు ఉన్నాడు. నెల రోజులుగా ప్రియాంక మునుపటి లాగే మానసిక వ్యాధితో బాధపడుతూ అందరిని ఇబ్బంది పెడుతోంది.
ప్రియాంక చుట్టుపక్కల వారిని దూషించడం, గొడవలు పెట్టుకోవడంతో భర్త, ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు బుగ్గరాజేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ మూడు రోజులు ఉంచారు. నయం కాకపోవడంతోపాటు ప్రియాంక ప్రవర్తనను చూసి వారు విసిగిపోయారు. నేరెల్లకు కుమార్తెను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులు ఈ నెల 14న రాత్రి ప్రియాంక ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నూలు దారం గొంతుకు బిగించి హత్య చేశారు.
15న అత్తగారి గ్రామం దర్గాపల్లికి తీసుకెళ్లి చేతబడి వల్ల ప్రియాంక మరణించిందని చెప్పి నమ్మించి దహన సంస్కారాలు నిర్వహించారు. దీనిపై నేరెల్ల గ్రామస్థులకు అనుమానం రావడంతో డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీసులు విచారణ చేయగా తల్లిదండ్రులే హత్య చేసినట్లు తేలడంతో స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు నుంచి ఫిర్యాదు తీసుకొన్నామని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి ఆదివారం నాడు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.