Asias Largest solar project In AP : ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 930 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్‌తో పాటు 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్ ఇటీవల కర్నూలు జిల్లాలో రెండు స్థలాలను పరిశీలించింది. త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
సౌర విద్యుత్తు ప్లాంట్ : ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మాణ దశలో 1,000 మందికి ప్రత్యక్షంగా 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సెకితో కలిసి ఎన్‌యూ సన్‌టెక్ చేపట్టే ఈ ప్రాజెక్టును 24 నెలల్లో ప్రారంభించాల్సి ఉంటుంది. 25 ఏళ్ల కాలానికి విద్యుత్తు కొనుగోలు చేసేలా సెకి ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్తును దేశంలోని వివిధ పంపిణీ సంస్థలకు సరఫరా చేస్తుంది. బిల్డ్-ఓన్-ఆపరేట్ (బీఓటీ) విధానంలో ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.
సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలుగా : ఏపీలో ప్రతి ఇల్లు, కార్యాలయం సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలుగా మారాలని సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో త్వరలో సౌరకాంతులు వెదజల్లనున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం ఇక్కడ ప్రత్యేకత సంతరించుకోనుంది. ఇక్కడి గృహవిద్యుత్తు కనెక్షన్లను సౌర వ్యవస్థతో అనుసంధానించడానికి చేపట్టనున్న పైలట్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది.
నియోజకవర్గం పరిధిలో 50 వేల గృహ కనెక్షన్లకు సౌరవిద్యుత్తు ఏర్పాటు లక్ష్యంగా అధికారులు చర్యలు ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ (రెస్కో) కి 1.30 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహవినియోగ కనెక్షన్లు 77 వేలు ఉండగా వాటిలో సరాసరి 50 వేల కనెక్షన్లు సౌర విద్యుత్తు అందించేందుకు ఎస్పీడీసీఎల్, రెస్కో అధికారులు గుర్తించారు.