Meerpet Murder Case Updates : హైదరాబాద్ మీర్‌పేట మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె భార్యను గురుమూర్తే పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడైన గురుమూర్తిని మంగళవారం అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందిన పుట్ట గురుమూర్తి, వెంకట మాధవిలకు పదమూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు.
గురుమూర్తి గతంలో ఆర్మీలో జవానుగా పనిచేశాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్‌డీఎల్‌లో కాంట్రాక్ట్ భద్రతా ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్నారు. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో భార్యపై గురుమూర్తి కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా అంతం చేయాలని అనుకున్నాడు.
అందుకు తగ్గట్టుగా జనవరి 13న భార్య, ఇద్దరు పిల్లల్ని బడంగ్‌పేట్‌లోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లల్ని అక్కడే వదిలేసి భార్యతో తిరిగి ఇంటికొచ్చాడు. ఈ నెల 15న మరోసారి ఇద్దరూ సోదరి ఇంటికి వెళ్లి రాత్రి 10:30 గంటలకు తిరిగొచ్చారు. పిల్లలు లేకపోవడం, ఇరుగుపొరుగు వారు పండగకు ఊరెళ్లడంతో హత్యకు ఇదే అదనుగా భావించాడు. 16న ఉదయం భార్యతో గొడవ పడి ఆమె తలను గోడకు బలంగా కొట్టాడు. తర్వాత గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని మాయం చేయడంపై ఇంటర్నెట్లో వెతికాడు.
Hyderabad Horror Murder Case : మృతదేహాన్ని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి కత్తితో చిన్న ముక్కలుగా చేసి నీటి బకెట్‌లో వేసి హీటర్‌తో ఉడికించాడు. స్టవ్‌పై ఎముకల్ని కాల్చి, రోకలితో దంచి పొడిగా మార్చాడు. పొడి, మాంసం ముద్దల్ని ఇంట్లోని మరుగుదొడ్డిలో దఫదఫాలుగా వేసి నీళ్లు వదిలాడు. మిగిలిపోయిన ఎముకల పొడి, ఇతర భాగాలను సమీపంలోని చెరువులో విసిరేశాడు. మరుగుదొడ్డిలో ఆనవాళ్లు కనిపించకుండా రసాయనాలతో శుభ్రం చేశాడు.
అనంతరం 17వ తేదీ సాయంత్రం మాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పాడు. వారితో పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా మృతురాలు ఇంట్లోకి వెళ్లినవి తప్ప బయటకు వచ్చిన దృశ్యాలు లేవు. దీంతో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అయినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు సవాల్‌గా మారింది. నిందితుడు గురుమూర్తి నివాసంలో ఫోరెన్సిక్ బృందాలు కీలక ఆధారాలు సేకరించడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది.