50K Trees Fell Due To Heavy Rains : నాలుగు రోజుల క్రితం వచ్చిన వర్షాలు, వరదలతో ఆస్తి, ప్రాణ నష్టమే కాదు, పచ్చని చెట్లూ నేలకూలాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈదురుగాలులతో కురిసిన కుండపోత వర్షంతో ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలమట్టమయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధిక వేగంతో వీచిన గాలుల కారణంగా అడవుల్లోని చెట్లు దెబ్బతిన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.
150 హెక్టార్ల విస్తీర్ణంలో నేలకొరిగిన చెట్లు : పచ్చని చెట్లు ప్రగతికి మెట్లన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక మొక్క పెరిగి వృక్షంగా మారేందుకు ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ అదే చెట్టు నేలమట్టం కావడానికి ఓ చిన్న గొడ్డలి చాలు. లేదా బలంగా వీచే ఈదురు గాలి చాలు. ములుగు జిల్లాలో రెండోదే జరిగింది. శనివారం రాత్రి వీచిన ఈదురుగాలులు, భారీ వర్షాలతో తాడ్వాయి అడవుల్లో కనీవినీ ఎరుగని రీతిలో చెట్లు నేలమట్టమయ్యాయి. బలమైన ఈదురుగాలులతో దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో అడవిలోని చెట్లన్నీ వేర్లతో సహా విరిగిపడ్డాయి. అడవులను సంరక్షించే అటవీ అధికారులనే ఆశ్చర్యరానికి గురి చేసిందీ ఘటన. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇలాంటిది జరగకపోవడమే మ్యాజిక్.
భారీ వర్షాలు, వరదలు సహజమే. కానీ ఈసారి వచ్చిన వరదలు మాత్రం తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. నాలుగు రోజులైనా ఇంకా వేలాది గ్రామాలు జల దిగ్భందనంలోనే ఉన్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించాయి. అయితే మనుషులు, పశు పక్ష్యాదులే కాదు పచ్చని చెట్లను కూడా వాయుగుండం మొదలుతోసహా నరికేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో చాలా చోట్ల 20సెంటీమీటర్ల పైనే ఈసారి వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా తాడ్వాయ్ లో 25సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
నేలమట్టమైన 50 వేల చెట్లు : శనివారం వచ్చిన ఈదురుగాలులకు అభయారణ్యంలోని తాడ్వాయి, ఏటూరునాగారం అటవీ ప్రాంతాల్లో భారీ మొత్తంలో చెట్లు విరిగిపడ్డాయి. అధిక వేగంతో గాలులు సంభవించి అడవుల్లోని చెట్లు దెబ్బతిన్నాయి. తాడ్వాయి-మేడారం రహదారికి ఇరువైపులా దాదాపు 3 కిలోమీటర్ల మేర ఏపుగా పెరిగిన చెట్లు పర్యాటకులను రారమ్మంటూ ఆహ్వానిస్తాయి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సగం నరికేసినట్లుగా ఉండే చెట్లే ఎక్కువుగా కనపడుతున్నాయి. దాదాపు యాభైవేల చెట్లు నేటమట్టమైనట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. ఏటూరునాగారం మండలం, తాడ్వాయి మండలాల్లా కేవలం రెండు గంటల్లోనే టోర్నాడా రీతిలో గాలులు వీచి పచ్చని చెట్లను పడగొట్టాయ్.
ఈదురు గాలుల కారణంగా జరిగిన నష్టాన్ని పూర్తి స్ధాయిలో అటవీ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఎంతమేర నష్టం వాటిల్లిందో తెలుసుకునేందుకు అధికారులు సర్వే చేపట్టారు. డ్రోన్ కెమెరాల సాయంతోనూ ఏ మేరకు అడవి దెబ్బతిన్నదీ తెలుసుకుంటున్నారు. పచ్చని చీర పరిచినట్లుగా కనిపించే ఈ అటవీ ప్రాంతాల్లో దాదాపు 40 నుంచి 50 రకాల చెట్లు ధ్వంసమైనట్లు గుర్తించారు. గతంలో ఎప్పుడూ ఇంత భారీగా చెట్లు పడిన ఘటనలు లేకపోవడంతో ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. చెట్లు ఇంత భారీగా నేలమట్టవడం ఇదే ప్రాంతంలో జరగడం తొలిసారి. కారణాలను తెలుసుకునేందుకు ఎన్ఆర్ఎస్సీ(నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్), ఐఎండీ(భారత వాతావరణ శాఖ) శాఖలను అటవీశాఖ అధికారులు ఇప్పటికే సంప్రదించారు. కచ్చితంగా తెలుసుకునేందుకు. శాటిలైట్ ద్వారా ఆరోజు ఎంత వేగంతో గాలులు వీచాయి గాలులే కాకుండా ఇంకేదైనా కారణం ఉందా? అనే అంశంపై శోధన జరుపుతున్నారు.
విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క : ములుగు జిల్లాలో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. విషయం తెలిసిన వెంటనే పీసీసీఎఫ్, డీఎఫ్ఓలతో ఫోన్లో మాట్లాడారు. లక్షచెట్ల వరకు నేలకూలడంపై సీతక్క విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. డ్రోన్ కెమెరాల సాయంతో నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
బుడమేరు వరదలో వాహనాలు - పెద్ద సంఖ్యలో నీటమునిగిన కార్లు! - Vehicles Stuck in Flood Water