4 People Dies Of Current Shock in East Godavari : విద్యుదాఘాతంతో నలుగురు యువకులు మరణించిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో చోటుచేసుకుంది. ఒకరికి తీవ్ర గాయాలు కాగా, అతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ఈ ఘటన జరిగింది. మృతులను పామర్తి నాగేంద్ర, మారిశెట్టి మణికంఠ, బొల్లా వీర్రాజు, కాసగాని కృష్ణగా గుర్తించారు. మృతదేహాలను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన కోమటి అనంతరావును చికిత్స నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సుమన్ చేతుల మీదుగా ఆవిష్కరణ : పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏడాదిన్నరగా రెండు వర్గాల మధ్య వివాదం జరుగుతోంది. ఇటీవల ఇరుపక్షాలతో చర్చించి కొవ్వూరు సబ్ కలెక్టర్ రాణి సుస్మిత అనుమతి ఇచ్చారు. ఈ ఉదయం సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఈలోగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సానుభూతి ప్రకటించారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా : మంత్రి కందుల దుర్గేశ్ తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబీకులను పరామర్శించారు. వారితో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.