Yashasvi Jaiswal VS Virat Kohli : టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC)లో ఓ సూపర్ రికార్డును అందుకోబోతున్నాడు. అ అద్భుత రికార్డ్ స్టార్ బ్యాటర్ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు. ఇంతకీ అదేంటంటే? జైస్వాల్ ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో మరో 132 పరుగులు చేస్తే ఒక డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా నిలుస్తాడు.
జైస్వాల్ 2023 - 25 డబ్ల్యూటీసీలో ఇప్పటి వరకు 1028 రన్స్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అజింక్య రహానె, రోహిత్ శర్మ తర్వాత ఒక ఎడిషన్‌లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన మూడో భారత ప్లేయర్‌గా నిలుస్తాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో యశస్వి ఈ సూపర్ రికార్డ్‌ను అందుకునే అవకాశం ఉంది.
2019-21 ఎడిషనల్‌లో అజింక్య రహానె (1159) పరుగులు సాధించి టాప్ పొజిషన్లో ఉన్నాడు. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుత టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 1398 రన్స్‌తో తొలి స్థానంలో నిలిచాడు. బెన్ డకెట్ 1028 పరుగులతో కలిసి యశస్వి రెండో స్థానాన్ని పంచుకున్నాడు.
వరల్డ్ రికార్డు సృష్టిస్తాడా?
సిక్స్‌ల పరంగానూ యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మరో 8 సిక్స్‌లు కొడితే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా అతడు చరిత్ర సృష్టిస్తాడు. న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ బ్రెండన్ మెక్ కల్లమ్ 33 సిక్స్‌లతో(2014) ప్రపంచ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. బెన్ స్టోక్స్ 2022లో 26 సిక్స్‌లు, యశస్వి జైస్వాల్ 2024*లో 26 సిక్స్‌లు ప్రస్తుతం రేసులో కొనసాగుతున్నారు. ఈ ఏడాది టీమ్ ఇండియా మరో 9 టెస్టులు ఆడనుంది. దీంతో జైస్వాల్ కచ్చితంగా మెక్ కల్లమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సెహ్వాగ్ రికార్డుపై రోహిత్ కన్ను - 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు అతడు 59 మ్యాచ్‌లు ఆడి 84 సిక్సర్లు కొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో అతడు చెలరేగి ఆడాలని పట్టుదలతో ఉన్నాడు. అయితే హిట్ మ్యాన్ మరో ఎనిమిది సిక్స్‌లు బాదితే వీరేంద్ర సెహ్వాగ్ (91 సిక్స్‌లు)ను అధిగమిస్తాడు. తద్వారా టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత ప్లేయర్‌గా నిలుస్తాడు.