WPL 2024 UP warriorz vs Mumbai Indians : మహిళల ప్రిమియర్ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో గత మ్యాచ్‌లో యూపీ చేతిలో ఎదురైన పరాభావానికి ముంబయి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేసింది. దీప్తి శర్మ(53) టాప్ స్కోరర్. మిగతా వారు విఫలమయ్యారు. శ్వేతా సెహ్రావత్ (17), గ్రేస్ హారిస్ (15) నామమాత్రపు పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో సైకా 3 వికెట్లు తీయగా, సీవర్ 2, మిగతా వారు తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. నాట్ సీవర్ (31 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 45 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 33 పరుగులు) పర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. చివర్లో వచ్చిన అమేలియా కెర్ (23 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 39 పరుగులు), సజనా (14 బంతుల్లో 4 ఫోర్లు 22*) దూకుడుగా ఆడింది. యూపీ బౌలర్లలో చమరి ఆటపట్టు 2, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
వాస్తవానికి ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ముంబయికు వరుసగా షాక్‌లు తగిలాయి. వారియర్స్ స్పిన్నర్ చమరి ఆటపట్టు తన వరుస ఓవర్లలో హేలీ మాథ్యూస్ (4), యాస్తికా భాటియా (9)ను పెవిలియన్ పంపింది. దీంతో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ముంబయి. అప్పుడు నాట్‌సీవర్ వచ్చి ఆదుకుంది. నిలకడగా బౌండరీలు బాదింది. అలా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి మూడో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అయితే హాఫ్ సెంచరీకి దగ్గరైన నాట్‌సీవర్‌ను రాజేశ్వరి గైక్వాడ్ ఔట్ చేసింది. ఇక నిలకడగా ముందుకెళ్తున్న హర్మన్‌ప్రీత్‌ను సైమా ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ పంపింది. దీప్తి శర్మ వేసిన తర్వాతి ఓవర్‌లో అమన్‌జ్యోత్ కౌర్ (7) సైమా చేతికి. ఆఖరి నాలుగు ఓవర్లలో అమేలియా కెర్, సజనా మంచిగా రాణించడం వల్ల ముంబయి 160 పరుగుల స్కోర్ చేసింది.
ఇంగ్లాండ్‌తో ఐదో మ్యాచ్ - రోహిత్, యశస్వి, కుల్దీప్ రికార్డులే రికార్డులు
ఐపీఎల్ ముందు ధావన్ ధనాధన్ - 99 నాటౌట్ - ప్రత్యర్థులు హడల్!