WPL 2024 RCB Smrithi Mandhana : 'ఈ సాలా కప్ నమ్ దే' అంటూనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - దిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. ఆర్సీబీ తన 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చేయలేనిది తొలిసారి డబ్ల్యూపీఎల్ సాధించి టైటిల్ గెలుచుకుంది. దీంతో ఆనందంలో ఉన్న అభిమానులను ఉత్తేజపరిచేందుకు ప్రెజెంటేషన్ వేడుకలో 'ఈ సాలా కప్ నమ్ దే' కాదు 'ఈ సాలా కప్ నమ్దూ' అంటూ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పింది. తాను టైటిల్ గెలుచుకువడాన్ని నమ్మలేకపోతున్నామని, దాని నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టవచ్చని స్మృతి పేర్కొంది.
స్మృతి మంధాన ఏం చెప్పింది? : "నేను చాలా నిజాయితీగల అభిమానులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ సపోర్టు లేకుండా ఇది సాధ్యం కాదు. మేం విజయం సాధించామనే వాస్తవాన్ని నమ్మలేకపోతున్నాం. కాస్త సమయం పడుతుంది. ఛాంపియన్ గా నిలవడంపై ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. కానీ ఒక మాట చెబుతా. మా ఆటపై ఎంతో గర్వంగా ఉంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని మేము ఇక్కడి వరకు వచ్చాము. గతాన్ని మరిచి ఇప్పుడు విజేతగా మీ ముందు నిల్చున్నాం. ఇదొక అద్భుతమైన అనుభూతి. మాకు లీగ్ దశలో చివరి మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ వంటిది. దానిని కూడా అధిగమించాం. తర్వాత సెమీస్, ఫైనల్లోనూ విజేతగా నిలిచాము. ఇలాంటి పెద్ద టోర్నీలో సరైన సమయంలో మంచి ఆటతీరును కనబరిచాం. గత ఏడాది నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకున్నాం. ఆర్సీబీ తరపున టైటిల్ సాధించడం గర్వంగా ఉంది. టాప్ 5 అద్బుత విజయాల్లో ఇదొకటని నమ్ముతున్ానం. వరల్డ్ కప్ ఎప్పటికీ టాప్. ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి చాలా సందేశాలు వస్తున్నాయి. ఈ సాలా కప్ నమదే ప్రతిసారి వినిపించే నినాదం. ఇప్పుడు దానిని మేము నిజం చేసి నిరూపించాం కాబట్టి ఇకపై 'ఈ సాలా కప్ నమ్దూ' (ఈ సారి కప్ మనది) అనండి. కన్నడ నాకు అంతగా తెలీదు. కానీ ఫ్యాన్స్‌కు ఇది చెప్పడం ఎంతో ముఖ్యం" అని వెల్లడించింది.
కాగా, అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఈ పోరులో దిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొత్తం 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ 19.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
WPL 2024 మిస్టరీ బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతి మందాన - ట్రోఫీ పట్టుకుని పోజులిస్తూ