Sprinter Usain Bolt : 100 మీటర్ల పరుగు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు జమైకా చిరుత, పరుగులు వీరుడు ఉసేన్ బోల్ట్. ఎందుకంటే అతడి సాధించిన రికార్డులు అలాంటివి. 200మీ.పరుగులోనూ ఎన్నో ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు బోల్ట్. తన పరుగుతో, హవభావాలతో స్ప్రింట్‌కు సూపర్ క్రేజ్‌ను తీసుకొచ్చాడు. అతడు రిటైరై ఏడేళ్లైనా పరుగులో అతడిలా ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు కనపడలేదు. ఇప్పటికీ బోల్ట్ రికార్డులు భద్రంగానే ఉన్నాయి.
ఒలింపిక్స్ల్లో చిరస్మరణీయ ప్రదర్శన చేసిన బోల్ట్, 2017 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తర్వాత పరుగుకు దూరమయ్యాడు. దీంతో ట్రాక్‌కు కళ తప్పింది. ఆ తర్వాత ఎంతో మంది స్ప్రింటర్లు వచ్చినా, ప్రపంచ ఛాంపియన్షిప్స్, ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించినా, కానీ బోల్ట్‌లాగా మాత్రం ఆధిపత్యం చలాయించలేదు. ఇంకా 100మీ. (9.58సె), 200మీ. (19.19సె)లో ప్రపంచ రికార్డులు బోల్ట్వే.
అయితే ఇప్పుడు ఓ ఇద్దరు టీనేజర్లు వయసుకు మించిన వేగంతో దూసుకొస్తున్నారు. ట్రాక్‌పై రయ్ రయ్ మంటూ వస్తున్న వీళ్ల పరుగు చేస్తుంటే బోల్ట్ రికార్డులను బద్దలు కొట్టేలా కనిపిస్తున్నారు. వారే 14 ఏళ్ల బ్రిటిష్ స్ప్రింటర్ డివైన్ ఐహెం, 16 ఏళ్ల ఆస్ట్రేలియన్ అథ్లెట్ గౌట్ గౌట్.
డివైన్ ఐహెం(Divine Iheme Athletics 100M) - తాజాగా డివైన్ ఐహెం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అండర్-14 పరుగు వీరుడిగా నిలిచాడు. లీ వ్యాలీ అథ్లెటిక్స్ కేంద్రంలో నిర్వహించిన 100మీ. పరుగు రేసులో 10.30 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు డివైన్. అనంతరం సచిన్ డెనిస్(జమైకా- 10.51సె) రికార్డును బ్రేక్ చేశాడు.
డివైన్ 12 ఏళ్ల వయసులోనే 11.30 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. అతడి తల్లిదండ్రులు ఎంకిరుకా(తల్లి), ఇన్నోసెంట్(తండ్రి) నైజీరియాకు చెందిన వారు. వారు కూడా అథ్లెట్స్. 2002 కామన్వెల్త్ క్రీడల్లో నైజీరియా తరఫున బరిలోకి దిగారు. స్ప్రింటర్ ఎంకిరుకానే ఆధ్వర్యంలోనే డివైన్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇంగ్లాండ్ ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో ఎంకిరుకానే పీడబ్ల్యూడీ అథ్లెటిక్స్ అకాడమీని రన్ చేస్తోంది.
యూరోపియన్ అండర్ - 18 ఆల్ టైమ్ పెర్ఫార్మెన్స్లో టెడ్డి విల్సన్ (10.26సె), జెఫ్ ఎరియస్ (10.27సె) తర్వాత మూడో స్థానం డివైన్ దే కావడం విశేషం.
గౌట్(Gout Gout Sprinter 100M) - ఈ 16 ఏళ్ల ఆస్ట్రేలియన్ అథ్లెట్ 2024 మార్చిలో క్వీన్స్లాండ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ అండర్-18 100మీ. పరుగులో బరిలోకి దిగి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 10.29సెకన్ల టైమింగ్‌ను నమోదు చేసి రికార్డ్ సృష్టించాడు.
గౌట్ ఫ్యామిలీ సూడాన్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. అయితే గౌట్ చిన్నతనం నుంచే పరుగుపై ప్రేమను పెంచుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గౌట్ ఆస్ట్రేలియా అండర్-20 100మీ. పరుగులో (10.48సె) ఛాంపియన్‌గా నిలిచాడు. 100తో పాటు 200మీ. (20.69సె) రేస్‌లో నేషనల్ రికార్డ్స్ గౌట్ పేరు మీదే ఉండటం విశేషం.
అలా డివైన్, గౌట్ ఇద్దరు భవిష్యత్‌లోనూ ఇలానే మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తే 2028 ఒలింపిక్స్‌లో పోటీపడే ఛాన్స్ ఉంది.
పారిస్ పారాలింపిక్స్ 2024 - భారత్ షెడ్యూల్ ఇదే - Paris Paralympics 2024