Anand Praised Ashwin As Chess Player : ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో పర్యటక జట్టును తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. అతడి కెరీర్‌లో ఇది వందో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్ ఐదు వికెట్లు తీయగా, అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు బీసీసీఐ అశ్విన్‌ను సత్కరించింది. ఈ క్రమంలో అతడి ప్రతిభను చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కొనియాడాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
'అశ్విన్ చెస్ ప్లేయర్‌లా అనిపిస్తాడు'
'నాకు అశ్విన్‌తో చాలాకాలంగా పరిచయం ఉంది. కొవిడ్-19 విజృంభిస్తున్న సమయంలో అనేక అంశాలపై మేం మాట్లాడుకున్నాం. అతడు నన్ను చాలాసార్లు తన యూట్యూబ్ ఛానల్‌లో చర్చా కార్యక్రమాలకు పిలిచాడు. కొన్నిసార్లు అతడిని చూస్తుంటే క్రికెటర్లలో చెస్ ప్లేయర్ లాగా అనిపిస్తాడు. అతడు అత్యున్నత స్థాయికి వెళ్తాడనే నమ్మకంతో ఉండేవాడిని. ఇప్పుడు అతడి కెరీర్‌లోనే అత్యంత గొప్ప సందర్భం ఇది. దానిని అతడు ఎంజాయ్ చేస్తాడని ఆశిస్తున్నా' అని విశ్వనాథన్ ఆనంద్ వెల్లడించాడు.
ఏంటి అశ్విన్‌కు చెస్ కూడా వచ్చా?
విశ్వనాథన్ ఆనంద్ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టాప్ చెస్ ప్లేయర్‌గా ఓ వెలుగు వెలిగిన ఆటగాడని కొనియాడాడు స్పిన్నర్ అశ్విన్. 'విశ్వనాథ్ ఆనంద్ గురించి నేను చాలా స్టోరీలు విన్నాను. ఇక్కడ నిజం ఏంటంటే, నేను కూడా కాస్త చెస్ నేర్చుకున్నా. చెస్ గురించి అవగాహన కలిగి ఉన్నా. అతడితో ఏదైనా విషయం మాట్లాడే సమయంలో నా కళ్లల్లో మెరుపులు మెరిసేవి. ఓ సందర్భంలో చెస్ ఆడటం మెకానికల్‌గా మారిపోయిందని అన్నాడు. ఆ మాట వినగానే అతడి దృష్టిలో చెస్ పట్ల ఆసక్తి కోల్పోతున్నట్లు అనిపించింది. కానీ, అలా ఏమీ జరగలేదు' అని అశ్విన్ తెలిపాడు. ఇక ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు చేసుకున్న ప్రశంసలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.